నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..

రైల్వేస్‌లో భారీ ఉద్యోగ ప్రకటన..
1,215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి RRB నోటిఫికేషన్ విడుదల

RRB Notification: నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 1,215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు (CEN No. 08/2026) కింద ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఆసక్తి ఉన్న నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే వీలు కలుగుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, జీతం, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలిద్దాం.

ఆన్‌లైన్ దరఖాస్తుల ముఖ్యమైన తేదీలు

రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక సమాచారం ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అక్టోబర్ 27, 2026న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 25, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి నవంబర్ 27 వరకు గడువు ఇవ్వబడింది. ఒకవేళ దరఖాస్తు దరఖాస్తుల వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సవరించుకోవడానికి డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తెస్తోంది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 7, 2026 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.

జీతం, వయోపరిమితి వివరాలు

స్టేషన్ మాస్టర్ ఉద్యోగం 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) యొక్క లెవెల్ 6 పరిధిలోకి వస్తుంది. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 ప్రారంభ ప్రాథమిక వేతనంగా (Basic Pay) లభిస్తుంది. దీనితో పాటు ఇతర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి. వయోపరిమితి విషయానికొస్తే, జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అయితే, ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

దరఖాస్తు రుసుము (Application Fee)

జనరల్ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ. 500గా నిర్ణయించారు. మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కి హాజరైన తర్వాత, వర్తించే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి రూ. 400 అభ్యర్థి ఖాతాకు రీఫండ్ చేయబడుతుంది.

మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులు, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాలు.. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EBC) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250గా నిశ్చయించారు. వీరు CBT పరీక్షకు హాజరైన అనంతరం ప్రాసెస్ ఛార్జీలు మినహాయించి మొత్తం ఫీజు రూ. 250 వాపసు ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ & మెడికల్ నిబంధనలు

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ నాలుగు విభిన్న దశల్లో జరుగుతుంది. మొదటగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది; ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

CBT అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా A-2 కేటగిరీ మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. కంటిచూపు సమస్యల నివారణకు లేసిక్ (LASIK) లేదా ఇతర కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న అభ్యర్థులు ఈ పోస్టుకు అనర్హులవుతారు.

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక పోర్టల్ rrbapply.gov.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యర్థులు ఒకే ఒక RRBని మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా జోన్లలో ఉన్న ఖాళీల పంపిణీని నోటిఫికేషన్‌లో వివరంగా తనిఖీ చేసిన తర్వాతే తగిన RRB బోర్డును ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.