ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌–2026ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఆయా పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.

ఈ జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూప్‌-1లో 149 పోస్టులు, గ్రూప్‌-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు పోలీస్‌, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్‌, ఇంజినీరింగ్‌, విద్యుత్‌ తదితర శాఖల్లోనూ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

నాలుగు దశల్లో నియామకాలు

మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను ప్రారంభించనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి

ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ సూచించింది. పోస్టుల వారీగా అర్హతలు, నియామక విధానం, నోటిఫికేషన్‌ వివరాలను అధికారికంగా పరిశీలించుకోవాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఆర్థికశాఖ అధికారిక వెబ్‌సైట్‌ http://goir.ap.gov.in ను సందర్శించాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో సూచించింది.