TG | రెండు డీఏలు విడుదల..

TG | రెండు డీఏలు విడుదల..

TG | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు కరువు భత్యాల (డీఏ)ను విడుదల చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తం పెండింగ్‌లో ఉన్న డీఏల్లో ప్రస్తుతం రెండు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు డీఏలు 2024 జనవరి 1, 2024 జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నాయి. వీటి ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు సహా దాదాపు 6.91 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

రెండు డీఏలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతలవారీగా చెల్లించనుంది. ఈ బకాయిల కోసం సుమారు రూ.6,174 కోట్ల వ్యయం కానుంది. అలాగే డీఏల అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.

ఈ రెండు డీఏలు కలిపి ఉద్యోగుల ప్రస్తుత డీఏలో 6.37 శాతం పాయింట్ల పెరుగుదల నమోదవుతుంది. ఉదాహరణకు రూ.లక్ష ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు సుమారు రూ.6,370 అదనంగా లభించనుంది. రెండు డీఏల బకాయిల చెల్లింపుపై ఆర్థిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పూర్తి విధానం స్పష్టమవుతుంది.

ప్రస్తుతం రెండు డీఏలు విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, మరికొన్ని డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటి బకాయిలను కూడా దశలవారీగా చెల్లించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిగిలిన బకాయిల చెల్లింపునకు నిర్దిష్ట గడువు మాత్రం ఇంకా ప్రకటించలేదు.