EPF | పీఎఫ్ పరిమితి పెంపు…
రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..
మరో 51 లక్షల మందికి ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు
EPF | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఈపీఎఫ్ వేతనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేల కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో కొత్తగా సుమారు 51 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి రానున్నారు. మరింత మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2014లో రూ.15 వేలకు పెంచింది. అనంతరం వేతనాల పెరుగుదల, ఆదాయాల్లో వచ్చిన మార్పులు, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పరిమితిని పెంచాలని నిర్ణయించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలకు రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ వేతనంతో కొత్తగా ఉద్యోగంలో చేరే వారు ఆటోమేటిక్గా ఈపీఎఫ్ పరిధిలోకి రారు. తాజాగా పరిమితి పెంపుతో రూ.25 వేల వరకు వేతనం పొందే ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. పీఎఫ్ పొదుపు సదుపాయం, పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనం, ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి రానున్నాయి.
ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.98 కోట్ల మంది పీఎఫ్ సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు 82 లక్షల మందికి పీఎఫ్ పెన్షన్ సదుపాయం అందుతోంది. వేతన పరిమితి పెంపుపై వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో సంఘటిత రంగంలోని మరింత మంది ఉద్యోగులకు భవిష్య భద్రత పెరగనుంది.
