కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
మొత్తం 10 ఏళ్లకు చేరిన వయోసడలింపు
పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు వర్తింపు
పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 16 వరకు పొడిగింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోసడలింపునకు అదనంగా మరో మూడేళ్లు కలపడంతో మొత్తం వయోసడలింపు 10 ఏళ్లకు చేరింది. ఈ నిర్ణయం పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు వర్తించనుంది. అయితే పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు వర్తించదు.
SI–కానిస్టేబుల్ వయోపరిమితి వ్యత్యాసం తొలగింపు
సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ పోస్టుల మధ్య ఉన్న గరిష్ట వయోపరిమితి వ్యత్యాసాన్ని సరిచేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం SI పోస్టులకు 32 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితి మధ్య ఉన్న మూడేళ్ల తేడాను తొలగించేందుకు తాజా సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు గడువు కూడా పొడిగింపు
మరోవైపు పోలీస్ ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును కూడా ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. తాజా నిర్ణయంతో వయోపరిమితి కారణంగా పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది.
