ముంబై : మన దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరడంతో, బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర తొలిసారిగా లక్ష రూపాయల మార్కును దాటింది. ఈ అనూహ్య పెరుగుదల వినియోగదారులపై, ముఖ్యంగా శుభకార్యాలకు బంగారం కొనాలనుకునే వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. దేశీయంగా బంగారం ధరలు పరుగులు పెట్టడం ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా కనిపిస్తున్న ఈ దూకుడు మంగళవారం చారిత్రక స్థాయికి చేరింది. ఈరోజు బులియన్ మార్కెట్ ట్రేడింగ్‌లో పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10గ్రాములకు ఈరోజు ఏకంగా డూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో దీని ధర రూ. 1,01,350కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10గ్రాములకు రూ.2,750 పెరిగి, రూ.92,900 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల పెరుగుదల ఒక్కరోజులోనే నమోదు కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సోమవారం కిలో వెండిపై రూ.1,000 పెరిగిన ధర, ఈరోజు స్థిరంగా ఉంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,01,000గా నమోదైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మాత్రం కిలో వెండి ధర ₹1,11,000 వద్ద ఉంది. ఈ ఉదయం 10గంటల సమయానికి వివిధ బులియన్ ట్రేడింగ్ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఈ వివరాలు అందించబడ్డాయి. బంగారం ధరలు అసాధారణ రీతిలో పెరగడంతో, కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది మరింత భారంగా మారింది.