Sudan | 67 మంది మృతి..

శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం


Sudan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్‌ కోర్డోఫ్యాన్‌ ప్రావిన్స్‌లోని ఓ బంగారు గని కూలిపోవడంతో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు కార్మికులు గనిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాయి. శిథిలాల తొలగింపు, బాధితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

సూడాన్‌ ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా ఉంది. అయితే అక్కడ బంగారం ఉత్పత్తిలో ఎక్కువ భాగం చిన్న తరహా ఆర్టిజనల్‌ మైనింగ్‌ ద్వారా జరుగుతోంది. ఈ విధానంలో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక సూడాన్‌లో ఉత్పత్తి అవుతున్న బంగారంలో కొంత భాగం అక్రమ మార్గాల్లో దేశం దాటుతున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. తాజా గని ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది.