Gold and Diamond Ganesha | లాల్‌బజార్‌లో కనువిందు చేస్తున్న అరుదైన గణపతి!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: మట్టితో చేసిన గణపతిని చూశాం.. పూలతో అలంకరించిన గణపతిని చూశాం.. పండ్లతో తీర్చిదిద్దిన వినాయకుడినీ చూశాం. కానీ.. బంగారం, వజ్రాలతో ధగధగలాడే గణపతిని ఎప్పుడైనా చూశారా? ఏకంగా 3,83,800 వజ్రాలతో మెరిసిపోతున్న ఈ అపురూప విఘ్నేశ్వరుడు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. లాల్‌బజార్‌లో కొలువుదీరిన ఈ బంగారు గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.వజ్రాల వెలుగుల్లో విఘ్నేశ్వరుడు మిరుమిట్లు గొలిపాడు.. బంగారు కాంతులతో ధగధగలాడుతూ లాల్‌బజార్‌లో భక్తులకు కనువిందు చేశాడు. దశావతారాల మధ్య కొలువుదీరడంతో ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లాల్‌బజార్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బంగారం, వజ్రాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఈ విగ్రహం భారతదేశంలోనే తొలిసారిగా రూపొందించిన అరుదైన విగ్రహంగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. పంచలోహాలతో తయారు చేసిన విగ్రహానికి బంగారు పూత పూసి, దానిపై అమెరికాకు చెందిన 3,83,800 వజ్రాలను పొదిగారు. దీంతో విగ్రహం విద్యుత్‌ దీపాల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంది.

విష్ణుమూర్తి దశావతారాలను ప్రతిబింబించేలా ప్రత్యేక రూపకల్పన చేసి, వాటి మధ్యలో గణేశుడు కొలువుదీరినట్లు విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిన్న రాత్రి నిర్వహించిన ఊరేగింపులో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వజ్రాల మెరుపులతో వెలిగిపోతున్న గణేశుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విగ్రహం రూపకల్పన, వజ్రాల అలంకరణ, విద్యుత్‌ కాంతుల సమన్వయం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి