సరస్వతీ అమ్మవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

బాసర, ఆంధ్ర ప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువుదీరిన బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో శరదియా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు గురువారం అమ్మవారు కూష్మాండ (Kushmanda) అవతారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు. నవరాత్రుల(Navaratri)లో అమ్మవారి నాలుగవ స్వరూప నామం కూష్మాండ. ‘కు’ అంటే చిన్న, ‘ఊష్మ’ అంటే శక్తి, ‘అండా’ అంటే విశ్వం.. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం. ఎనిమిది భుజాలు కలిగి విరాజిల్లుతుంది.

కూష్మాండ దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్నిసృష్టించి, తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక తమళార్చన చేసి హారతి నిచ్చి అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర (Maharashtra) నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ చిన్నారులకు ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో అర్చకులచే అక్షరాభ్యాస పూజలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply