భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. పెరుగుతున్న నీటిమట్టం

ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం..
8–9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం

భద్రాచలం, ఆంధ్రప్రభ: గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కూనవరం వద్ద 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నాయి. వరద ఉద్ధృతి మరింత పెరిగి గరిష్ఠంగా 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఇప్పటికే వాగులు, కల్వర్టులు, కాజ్‌వేలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. వరద గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.