అంగన్వాడీ వర్కర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ..
రాప్తాడు, ఆంధ్రప్రభ: అంగన్వాడీ వర్కర్లకు రెండో విడత జ్ఞానజ్యోతి–120 శిక్షణలో భాగంగా జ్ఞానజ్యోతి పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఐసీడీఎస్ సెక్టార్–2 సూపర్‌వైజర్ శ్రీవాణి తెలిపారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ వర్కర్లకు జ్ఞానజ్యోతి–120 శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా సూపర్‌వైజర్ శ్రీవాణి మాట్లాడుతూ చిన్నారుల్లో కనిపించే వివిధ రకాల వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. అంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, భాషా లోపం, శారీరక వైకల్యం, బుద్ధిమాంద్యం, అభ్యసన వైకల్యం, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టు వ్యాధి, మరుగుజ్జుతనం, దీర్ఘకాలిక నరాల సమస్యలు, కండరాల క్షీణత, బహుళ నాడీ బలహీనత, మానసిక రుగ్మతలు, యాసిడ్ దాడి బాధితుల్లో ఏర్పడే వైకల్యాలు, తలసేమియా, రక్తం గడ్డకట్టని స్థితి, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించిన వెంటనే భవిత కేంద్రాలకు పంపించేందుకు అంగన్వాడీ వర్కర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గౌరవించాలని, ఇతర పిల్లలతో సమానంగా వారికి విద్య, సంరక్షణ అందించాలనే అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ మల్లికార్జున, విద్యాశాఖ డీఆర్‌పీలు రామ్మూర్తి, సూర్యనారాయణ, వెంకట్‌నాయుడు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు లీలావతి, శ్రీవాణి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
