Global Warming | క్లైమేట్ చేంజ్ దెబ్బ.. ప్రపంచ రికార్డు కోల్పోయిన ద్వీపం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అంటార్కిటికా సమీపంలోని జవోడోవ్‌స్కీ ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ ద్వీపం దాని గుర్తింపును కోల్పోయింది. అక్కడ ఉండే పెంగ్విన్ల సంఖ్య భారీగా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

15 ఏళ్లలో 63 శాతం తగ్గిన పెంగ్విన్లు

బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఎఎస్‌) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. జవోడోవ్‌స్కీ ద్వీపంలోని చిన్‌స్ట్రాప్ పెంగ్విన్ల సంఖ్య 2011 నుంచి 2025 మధ్య ఏకంగా 63 శాతం తగ్గింది. అంటే 2011లో సుమారు 10.9 లక్షల పెంగ్విన్లు ఉండగా.. 2025 నాటికి వాటి సంఖ్య దాదాపు 4.02 లక్షలకు పడిపోయింది. దాదాపుగా 6.8 లక్షలకు పైగా పెంగ్విన్లు తగ్గిపోయాయి.

అగ్నిపర్వతం పేలినా.. అసలు విలన్ అది కాదట

జవోడోవ్‌స్కీ ద్వీపంలో 2016లో మౌంట్ కర్రీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అక్కడి పెంగ్విన్ల సంఖ్య తగ్గడానికి ఈ విస్ఫోటనమే కారణమై ఉంటుందని తొలుత భావించారు. కానీ పరిశోధకులు సేకరించిన డేటా ఆ అనుమానాలను తారుమారు చేసింది. పెంగ్విన్ల సంఖ్య తగ్గడం 2016 అగ్నిపర్వత విస్ఫోటనానికి ముందే మొదలైందని అధ్యయనంలో తేలింది. విస్ఫోటనం తర్వాత కూడా వాటి సంఖ్య తగ్గుతూనే వచ్చింది. దీంతో అగ్నిపర్వతం కంటే సముద్ర పర్యావరణంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒక జాతి కష్టాల్లో.. మరో జాతి మాత్రం దూసుకెళ్తోంది

ఇదే ద్వీపంలో మరో ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. చిన్‌స్ట్రాప్ పెంగ్విన్ల సంఖ్య భారీగా పడిపోతుంటే..మాకరోనీ పెంగ్విన్ల సంఖ్య మాత్రం పెరిగింది.2011లో సుమారు 3.38 లక్షలుగా ఉన్న మాకరోనీ పెంగ్విన్లు.. 2025 నాటికి 4.33 లక్షలకు చేరాయి. అంటే దాదాపు 95 వేల పెంగ్విన్లు పెరిగాయి.వివిధ రకాల ఆహారాన్ని స్వీకరించే సామర్థ్యం మాకరోనీ పెంగ్విన్లకు ఉండటంతో.. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అవి కొంత మెరుగ్గా అలవాటు పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

జవోడోవ్‌స్కీకి పోయిన ‘నంబర్ వన్’ హోదా

ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా గుర్తింపు పొందిన జవోడోవ్‌స్కీ ద్వీపం.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయింది. ప్రస్తుతం అంటార్కిటికాలోని కేప్ అడేర్ ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా నిలిచింది. 2018లో అక్కడ 10 లక్షలకు పైగా అడెలీ పెంగ్విన్లు ఉన్నట్లు నమోదైంది. ఒకప్పుడు లక్షలాది పెంగ్విన్లతో సందడిగా కనిపించిన జవోడోవ్‌స్కీ ద్వీపం.. ఇప్పుడు వాటి సంఖ్యలో భారీ తగ్గుదలను చూడటం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది.

పెంగ్విన్ల కథలో దాగి ఉన్న పెద్ద హెచ్చరిక

ఇది కేవలం ఓ ద్వీపంలోని పెంగ్విన్ల సంఖ్య తగ్గిన కథ కాదు. సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆహార గొలుసులో కూడా మార్పులు వస్తున్నాయి. పెంగ్విన్లకు ప్రధాన ఆహారమైన క్రిల్‌ లభ్యత తగ్గితే.. దాని ప్రభావం ఒక్క జాతికే పరిమితం కాకుండా మొత్తం సముద్ర జీవావరణంపై పడే అవకాశం ఉంది.అంటే.. పెంగ్విన్లు తగ్గుతున్నాయంటే అక్కడి మంచు మాత్రమే మారడం కాదు.. సముద్రం లోపలే ఏదో పెద్ద మార్పు జరుగుతోందన్న హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.