జపాన్‌ సంస్థతో గ్లోబల్‌ యూనివర్సిటీ భాగస్వామ్యం

క్యాన్సర్‌ పరిశోధన, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయుష్షుపై సంయుక్త పరిశోధనలు

ఏఐ ఆధారిత వైద్య పరిశోధనలకు ప్రాధాన్యం..
రూ.లక్షల కోట్ల విలువైన ఆరోగ్య రంగ అవకాశాల దిశగా అడుగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌), జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌బీఐ)తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యం కుదుర్చుకుంది. డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్ల నాయకత్వంలో గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (గిరి) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీయూఎఫ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ఎస్‌బీఐ అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. నవంబర్‌ 1, 2026న పరిశోధన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడంతో భాగస్వామ్యానికి అధికారిక రూపం లభించింది. హైదరాబాద్‌లో సమీకృత విశ్వవిద్యాలయం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలన్న జీయూఎఫ్‌ లక్ష్యానికి ఈ ఒప్పందం తోడ్పడనుంది.

రూ.లక్షల కోట్ల పరిశోధనా లక్ష్యాలు..

గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ ఏర్పాటుకు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్లతోపాటు ఇతర కీలక నాయకులు, సహకార భాగస్వాములు ప్రకటించిన 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధుల నిబద్ధత మద్దతుగా నిలుస్తోంది. ఈ నిధులను సంస్థ నిర్మాణంతోపాటు ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక రంగాల్లో లక్ష్యాల సాధనకు వినియోగించనున్నారు. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం ప్రస్తుతం రెండో దశలోకి ప్రవేశించింది. మూడు కీలక పరిశోధనా రంగాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

క్యాన్సర్‌ గుర్తింపునకు కంప్యూటేషనల్‌ ఆంకాలజీ..

ఎపిజెనోమిక్‌ బయోలాజికల్‌ క్లాక్‌లను ఉపయోగించి క్యాన్సర్‌ పురోగతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడం ఈ పరిశోధనలో ప్రధాన అంశం. వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు అవసరమైన బయోమార్కర్లను కనుగొనడంతోపాటు భారతీయ రోగులకు అనుగుణమైన నమూనాలను అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల క్యాన్సర్‌ నిర్ధారణ, పరిశోధనలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఏఐ..

డిమెన్షియాతో బాధపడుతున్న వ్యక్తుల కోసం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన డిజిటల్‌ కాగ్నిటివ్‌ స్టిమ్యులేషన్‌పై బృందం ప్రచురించిన పరిశోధన ఆధారంగా తదుపరి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వృద్ధుల జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యాన్ని కాపాడేందుకు కృత్రిమ మేధ ఆధారిత విధానాలను అభివృద్ధి చేయనున్నారు.

దీర్ఘాయుష్షుకు మల్టీ-ఓమిక్స్‌ పరిశోధనలు..

జీవసంబంధమైన వయస్సును కొలిచేందుకు సమగ్ర ప్రమాణాన్ని రూపొందించడం ఈ పరిశోధనలో మరో కీలక అంశం. నివారణ వైద్య సంరక్షణకు మార్గనిర్దేశం చేసే వ్యక్తిగతీకరించిన డిజిటల్‌ ట్విన్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ విధానం ద్వారా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి, తగిన వైద్య సంరక్షణ ప్రణాళికలను రూపొందించేందుకు అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ పరిశోధనా సంస్థలతో అనుసంధానం..

ఈ భాగస్వామ్యం భారత్‌లో వైద్యపరంగా ప్రాధాన్యమున్న ప్రశ్నలను ప్రపంచస్థాయి పరిశోధనతో అనుసంధానిస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్‌, ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల నుంచి ఈ పరిశోధనపై ఆసక్తి పెరుగుతోంది. జపాన్‌లోని ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థల నెట్‌వర్క్‌తో అనుసంధానం, విద్యా మార్పిడి, శిక్షణ, ఉమ్మడి పరిశోధనలు, గ్రాంట్‌ ప్రతిపాదనల రూపకల్పన వంటి అంశాల్లోనూ ఎస్‌బీఐ, జీయూఎఫ్‌తో కలిసి పనిచేయనుంది. సంయుక్త పరిశోధనలతోపాటు పరిశోధనా ప్రాధాన్యతల నిర్ణయం, పీర్‌ రివ్యూడ్‌ ప్రచురణలు, విద్యా కార్యక్రమాలు, విజిటింగ్‌ ఫ్యాకల్టీ నియామకాల రూపకల్పనలోనూ సహకరించనుంది.

పరిశోధనలకు ప్రముఖుల దిశానిర్దేశం..

డాక్టర్‌ కంచెర్ల, డాక్టర్‌ కిటానో ఈ కార్యక్రమాలకు శాస్త్రీయ, వ్యూహాత్మక దిశానిర్దేశం చేయనున్నారు. ఎస్‌బీఐ సీనియర్‌ పరిశోధకులు డాక్టర్‌ అయాకో యాచీ, డాక్టర్‌ సుచీంద్ర కె. పలనియప్పన్‌, డాక్టర్‌ సామిక్‌ ఘోష్‌ గిరి బృందంతో కలిసి పరిశోధనా కార్యక్రమాలకు నాయకత్వం వహించనున్నారు.

భారత్‌లో పరిశోధనలకు ప్రత్యేక అవకాశాలు..

ఈ భాగస్వామ్యంపై గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్ల మాట్లాడుతూ.. రోగుల జనాభాలో వైవిధ్యం, ఆరోగ్య సంరక్షణ అవసరాల విస్తృతి దృష్ట్యా ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, సాంకేతిక రంగాల్లో పరిశోధనను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ ప్రత్యేక అవకాశాలను అందిస్తోందన్నారు. గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచస్థాయి శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, భారత వైద్య రంగ వాస్తవ పరిస్థితులను ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శాస్త్రీయ ఆవిష్కరణలను అర్థవంతమైన ఆరోగ్య ఫలితాలుగా మార్చడంతోపాటు ఆరోగ్య సమానత్వాన్ని పెంపొందించే పరిశోధనా సామర్థ్యాలను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంక్లిష్ట ఆరోగ్య సమస్యలకు సైన్స్‌ పరిష్కారాలు..

ఎస్‌బీఐ అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో మాట్లాడుతూ.. క్యాన్సర్‌, అభిజ్ఞా సామర్థ్యం క్షీణించడం వంటి సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలంటే జీవ వ్యవస్థలు పరస్పరం ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో సిస్టమ్స్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ సైన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌తో సహకారం వైద్యపరంగా ప్రాధాన్యమున్న రంగాల్లో పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంతోపాటు భారత్‌లో శాస్త్రీయ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ గురించి..

జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌బీఐ) లాభాపేక్షలేని సంస్థ. సంక్లిష్టమైన బయోమెడికల్‌ సమస్యల పరిష్కారానికి సిస్టమ్స్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ సైన్స్‌, కృత్రిమ మేధను ఉపయోగిస్తూ పనిచేస్తోంది. నోబెల్‌ ట్యూరింగ్‌ ఛాలెంజ్‌ను ప్రతిపాదించిన అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో నాయకత్వంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రధాన శాస్త్రీయ ఆవిష్కరణలు చేయగల కృత్రిమ మేధ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఈ ఛాలెంజ్‌ లక్ష్యం. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా, మీలా – క్యూబెక్‌ ఏఐ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ క్యూరీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఒసాకా, ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వంటి ప్రముఖ సంస్థలతో ఎస్‌బీఐ కలిసి పనిచేస్తోంది.

గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ గురించి..

గిరి పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, సాంకేతిక రంగాల సమ్మేళనంగా బహుళ విభాగాల పరిశోధన, ఆవిష్కరణల సంస్థను నిర్మిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రణాళికలో ఆరు విద్యా సంస్థలు, ఏడు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, 1,200 పడకల సూపర్‌ స్పెషాలిటీ బోధన, పరిశోధనా ఆసుపత్రి, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఇన్నోవేషన్‌ హబ్‌ ఉన్నాయి. పరిశోధన, విద్య, ఆవిష్కరణల ద్వారా భారత్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరోగ్య సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం.