వింతగా కనిపించే కుక్కల కోసం పోటీ, విజేతగా జిన్నీ లూ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఎక్కడైనా అందాల పోటీలు చూసే ఉంటాం.. కానీ అందవిహీన పోటీలు ఎక్కడైనా చూశారా? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. ప్రపంచంలో నిజంగానే ఇలాంటి పోటీ జరుగుతోంది. కానీ ఇది మనుషులకు కాదు.. పెంపుడు కుక్కలకు.. అంతేకాదు ఏటా నిర్వహించే ఈ పోటీలో ప్రత్యేకమైన రూపంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ కుక్కకు ‘ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్క’ అనే టైటిల్‌ను కూడా అందిస్తున్నారు. 2026లో ఈ అరుదైన టైటిల్‌ను గెలుచుకున్న ఆ కుక్క ఎవరు? దాని కథ ఏంటి? తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్క ఏదంటే.. తాజాగా జిన్నీ లూ పేరు వినిపిస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన ‘ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్కల పోటీ’ లో 2026 విజేతగా ఆరేళ్ల పగ్ జాతికి చెందిన జిన్నీలూ నిలిచింది. ఈ పోటీ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఈ టైటిల్ దక్కడం విశేషం.

నాలుగోసారికి విజయం..
జిన్నీ లూకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. ఇప్పటికే మూడుసార్లు ఈ పోటీలో పాల్గొన్నగా.. 2025లో రెండో స్థానంలో నిలిచింది. నాలుగోసారి బరిలోకి దిగిన జిన్నీ లూ ఈసారి ఏకంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆగస్టు 14న శాంటా రోసాలోని సోనోమా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో జరిగిన పోటీలో ప్రత్యేకమైన రూపంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.
జిన్నీ లూ ఈ పోటీలో గెలవడానికి ముఖ్యంగా దాని పొడవుగా బయటకు కనిపించే నాలుక, పెద్దగా కనిపించే కళ్లు, ముఖంపై ముడతలు ప్రధానం. అయితే ఈ పోటీ నిర్వాహకుల ఉద్దేశం మాత్రం కుక్కలను అవమానించడం కాదని చెబుతున్నారు. ఇతర కుక్కలతో పోలిస్తే భిన్నంగా కనిపించే జంతువుల్లోనూ ప్రత్యేకమైన అందం, వ్యక్తిత్వం ఉంటుందని చెప్పడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
దక్షిణ కొరియా నుంచి కాలిఫోర్నియా వరకు..
జిన్నీ లూ కథలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. దక్షిణ కొరియా పర్వత ప్రాంతాల్లో తీవ్ర చలిలో ఒక చెక్క పెట్టెలో ఉన్న జిన్నీ లూను రక్షించారు. పగ్ రెస్క్యూ ఆఫ్ కొరియా, పగ్ హోటల్ సీనియర్ పగ్ శాంక్చువరీ సంస్థల సహకారంతో దానికి కొత్త జీవితం లభించింది. సుమారు నాలుగేళ్ల క్రితం మిషెల్ గ్రేడీ అనే ఆమెను దానిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం జిన్నీ లూ సాధారణ పెంపుడు కుక్కగానే కాదు.. ఇక నుంచి తనలా రక్షించబడిన జంతువుల తరఫున అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.
ఈ విజయంతో జిన్నీ లూ యజమాని మిషెల్ గ్రేడీకి 5,000 డాలర్ల బహుమతి లభించింది. ఈ పోటీలో తొమ్మిది కుక్కలు పాల్గొనగా.. రెండో స్థానంలో చివావా-పోమెరేనియన్ మిశ్రమ జాతికి చెందిన పింకీ నిలిచి 3,000 డాలర్లు గెలుచుకుంది. మూడో స్థానాన్ని చివావా మిశ్రమ జాతికి చెందిన ఒట్టో దక్కించుకుని 2,000 డాలర్లు అందుకున్నాడు.
