Gautam Ghattamaneni | నాని సినిమాకు మహేశ్ బాబు కొడుకు షాకింగ్ రివ్యూ!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: సినిమా బాగుంటే ప్రశంసలు.. నచ్చకపోతే విమర్శలు. సాధారణ ప్రేక్షకుడి నుంచి సినీ ప్రముఖుల వరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయం ఉంటుంది. అయితే ఓ స్టార్ హీరో కుమారుడు మరో స్టార్ హీరో సినిమాకు రేటింగ్ ఇస్తే మాత్రం ఆ చర్చే వేరు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని చేసిన రివ్యూ టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’కు గౌతమ్ కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ను చూసిన గౌతమ్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించాడు. సినిమా తన అంచనాలను అందుకోలేకపోయిందని పేర్కొంటూ తక్కువ రేటింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే సినిమాలోని కొన్ని అంశాలను మాత్రం గౌతమ్ మెచ్చుకున్నాడు. సినిమాటోగ్రఫీ, భావోద్వేగ సన్నివేశాల్లో నటీనటుల ప్రదర్శన తనకు నచ్చినట్లు పేర్కొన్నాడు. అయినప్పటికీ మిగతా అంశాలు నిరాశపరిచాయని అభిప్రాయపడ్డాడు. దీంతో లెటర్బాక్స్డ్ వేదికగా ఆయన ఇచ్చిన ఒక్క స్టార్ రేటింగ్ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మహేశ్ బాబు సినిమాలకూ తక్కువ రేటింగ్స్!
గౌతమ్ ఘట్టమనేని సినిమా రివ్యూలపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన లెటర్బాక్స్డ్ ఖాతాలో ఇచ్చిన రేటింగ్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా తన తండ్రి మహేశ్ బాబు నటించిన కొన్ని సినిమాలకు కూడా తక్కువ రేటింగ్స్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
తాజాగా యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు కూడా గౌతమ్ అర్ధ స్టార్ మాత్రమే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాని ‘ది ప్యారడైజ్’కు ఒక్క స్టార్ ఇవ్వడంతో ఆయన సినిమా ఎంపికలు, రివ్యూలపై మరోసారి చర్చ మొదలైంది. స్టార్ హీరోల కుటుంబాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, సినిమాల విషయంలో తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తున్నాడనే కోణంలోనూ ఈ విషయం ఆసక్తి రేపుతోంది.
తన రివ్యూలపై గౌతమ్ సరదా స్పందన!
గౌతమ్ ఇచ్చే రేటింగ్స్‌పై సోషల్ మీడియాలో చర్చ పెరగడంతో ఆయన కూడా తన లెటర్బాక్స్డ్ ప్రొఫైల్ ద్వారా సరదాగా స్పందించినట్లు సమాచారం. తన ఖాతా జాతీయ వార్తల్లో చోటు సంపాదించేంతగా ప్రాధాన్యం పొందిందనే భావనతో వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మొత్తానికి, ‘ది ప్యారడైజ్’కు గౌతమ్ ఇచ్చిన ఒక్క స్టార్ రేటింగ్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.

