గరిడేపల్లిలో బైక్‌ దొంగల ముఠా అరెస్టు

రూ.3 లక్షల విలువైన 9 బైకులు స్వాధీనం

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : విలాసవంతమైన జీవితం, వ్యసనాలకు బానిసై బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గరిడేపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన తొమ్మిది మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్‌నగర్‌ సీఐ చలమంద రాజు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కలకోవ గ్రామానికి చెందిన మండవ శివశంకర్‌ గత నెల 29న కీతవారిగూడెంలోని తన మామ ఇంటి ముందు పార్క్‌ చేసిన హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ బైక్‌ (టీఎస్‌05ఈఏ1171) చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం ఎస్సై బి.శ్రీకాంత్‌గౌడ్‌ సిబ్బందితో కల్మల్‌ చెరువు క్రాస్‌రోడ్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మిర్యాలగూడ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారు గరిడేపల్లికి చెందిన తోకల మధు (22), తమిళనాడుకు చెందిన క్షేమ ముగేష్‌కుమార్‌ (26)గా గుర్తించారు. వీరితో పాటు పోనుగోడు గ్రామానికి చెందిన బైక్‌ మెకానిక్‌ షేక్‌ జానీపాషా (23), అప్పన్నపేటకు చెందిన ఓ మైనర్‌ కలిసి ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. గత జూన్‌ నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ, దామరచర్ల, రామన్నపేట, నార్కట్‌పల్లి, కీతవారిగూడెం తదితర ప్రాంతాల్లో తొమ్మిది మోటార్‌సైకిళ్లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ తెలిపారు. చోరీ చేసిన బైకులను జానీపాషాకు ఇచ్చి మరమ్మతులు చేయించి విక్రయించి, వచ్చిన డబ్బును పంచుకునేందుకు పథకం వేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ వెంట ఎస్సై శ్రీకాంత్‌, రైటర్‌ నాగేశ్వరరావు, ఏఎస్సై గౌరీశంకర్‌, సిబ్బంది నగేష్‌, ప్రశాంత్‌, సురేష్‌, రవీందర్‌, కరుణాకర్‌ తదితరులు ఉన్నారు.