43వ డివిజన్‌లో ‘చెత్త రాజ్యం’.. అధికారులకు కనిపించని దుస్థితి

విద్యాసంస్థల మధ్య చెత్త కుప్పలు.. స్థానికుల ఆగ్రహం

పాల్వంచ, ఆంధ్రప్రభ: 43వ డివిజన్‌లో విద్యాసంస్థల సమీపంలో చెత్త కుప్పలు పేరుకుపోతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల, కేఎల్‌ఆర్‌ పాఠశాలలు, కళాశాలలకు సమీపంలోనే చెత్తను యథేచ్ఛగా పారబోస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. విద్యాసంస్థల మధ్య చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, వ్యర్థాల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది అధికారికంగా ఏర్పాటు చేసిన చెత్త నిల్వ కేంద్రంగా ఉందా? లేక అధికారుల నిర్లక్ష్యంతో అనధికారికంగా ఏర్పడిన చెత్త అడ్డాగా మారిందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించే అధికారులు, తమ కళ్లముందే పేరుకుపోతున్న చెత్తను ఎందుకు తొలగించడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. డివిజన్‌ ప్రజల ఆరోగ్యంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్త కుప్పలను తొలగించి, అక్కడ మళ్లీ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని 43వ డివిజన్‌ ప్రజలు మున్సిపల్‌ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.