ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

మంచి నాయకులను ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయండి
ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. గురువారం ఆయన తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి గన్నవరం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, మంచి నాయకులను ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఎవరికి ఓటు వేయాలనేది ప్రజల ఇష్టమని, అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తోడ్పాటుతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. గన్నవరంలో ఎంతోకాలంగా ఉన్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.54 లక్షలతో వాహనాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం ప్రాంతాల్లో సేకరించిన చెత్తను జిందాల్‌ సంస్థకు తరలిస్తున్నామని, రెండేళ్లుగా ఈ విధానం కొనసాగుతోందని చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చెత్త సమస్య పరిష్కారమైందన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరగాలంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని యార్లగడ్డ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఒక్కడినే అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తున్నానని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కూడా తోడైతే స్థానిక పాలన మరింత వేగవంతమవుతుందని అన్నారు. కూటమి ధర్మంలో భాగంగా నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో రెండింటిని బీజేపీకి కేటాయించామని, జనసేనకు 18 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక ఎంపీపీ స్థానాన్ని ఇచ్చామని వివరించారు. గన్నవరం నియోజకవర్గంలో 91 ఎంపీటీసీ స్థానాలు, నాలుగు జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ కూడా పోటీ చేస్తోందని తెలిపారు.

ఎక్కడా బెదిరింపులకు పాల్పడలేదని యార్లగడ్డ చెప్పారు. గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నికల్లో గొడవలు, దాడులు, రిగ్గింగ్‌ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గత 29 నెలలుగా ఒక్క వైసీపీ కార్యకర్తపై కూడా తప్పుడు కేసు పెట్టలేదని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు.

గన్నవరంలో వ్యాపారులను ఇబ్బంది పెట్టే దందాలకు, రాజకీయ వేధింపులకు తావులేదని స్పష్టం చేశారు. గన్నవరం పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.