జాతీయ రహదారిపై గంజాయి దందా బట్టబయలు
జాతీయ రహదారిపై గంజాయి దందా బట్టబయలు
53 కిలోల గంజాయితో యువకుడు అరెస్ట్.. కారు, సెల్‌ఫోన్ స్వాధీనం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. నల్లమాడ మండల పరిధిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, 53 కిలోల గంజాయితో పాటు కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను పుట్టపర్తి ఇన్‌చార్జి డీఎస్పీ శివనారాయణ స్వామి మంగళవారం నల్లమాడ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో నల్లమాడ సీఐ వి. శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
కదిరి–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-716జీ)లోని పులగంపల్లి క్రాస్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కదిరి వైపు నుంచి వస్తున్న ఏపీ39 ఎస్‌ఏ 7507 నంబర్ గల హ్యుందాయ్ వెర్నా కారును ఆపి తనిఖీ చేయగా, వాహనం డిక్కీలో ఉన్న రెండు మూటల్లో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు.
వాహనం నడుపుతున్న నల్లమాడ మండలం చారుపల్లికి చెందిన బి. వెంకటరమణ (25)ను అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. నిందితుడి వద్ద నుంచి 24 ప్యాకెట్లలో సుమారు 53 కిలోల గంజాయి, హ్యుందాయ్ వెర్నా కారు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. విచారణలో రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున ఆదేశాల మేరకు గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లికార్జున కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 37/2026గా కేసు నమోదు చేసి, ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సి) రీడ్ విత్ 20(బి)(ii)(బి) కింద దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
