గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారిపై టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1 కిలో 20 గ్రాముల గంజాయితో పాటు సెల్‌ఫోన్‌, రూ.2 వేల నగదు, నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌, ఏటీఎం కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

సీఐ బన్సీలాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మహారాష్ట్ర నుంచి వేములవాడకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో మహారాష్ట్రలోని తొడ్స గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.4 వేలతో గంజాయిని కొనుగోలు చేసి వేములవాడకు తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.