గంగ ఉగ్రరూపం.. పాట్నాలో హైఅలర్ట్
- ఘాట్లకు వెళ్లే మార్గాలు మూసివేత..
- ఎస్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాల మోహరింపు
పాట్నా, ఆంధ్రప్రభ : బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో పాట్నాతో పాటు గంగా పరివాహక ప్రాంతాల్లోని 12 జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. గాంధీ ఘాట్, హతిదా వద్ద గంగా నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

పాట్నాలోని దిఘా, మనేర్ ప్రాంతాల్లోనూ గంగా ఉద్ధృతి కొనసాగుతోంది. పున్‌పున్, దర్ధా వంటి ఉపనదుల్లోనూ నీటిమట్టం పెరుగుతుండటంతో వరద పరిస్థితులపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం నాటికి గంగా నీటిమట్టం మరో 40 సెంటీమీటర్లకు పైగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

పాట్నా సిటీలో గంగా నీరు ఘాట్ల మార్గాల్లోకి చేరడంతో భద్రఘాట్, మహావీర్‌ఘాట్‌కు వెళ్లే రహదారులను మూసివేశారు. ప్రజలు, వాహనాలు ఘాట్ల వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రఘాట్ నుంచి మహావీర్‌ఘాట్ మీదుగా కంగన్‌ఘాట్ వరకు రాకపోకలను నిలిపివేశారు. అశోక్ రాజ్‌పథ్, గాయ్‌ఘాట్ వైపు నుంచి ఘాట్లకు వెళ్లే మార్గాల్లోనూ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఫతువా ప్రాంతంలోని కచ్చీ దర్గా నుంచి రాఘోపూర్ వెళ్లే మార్గంలోనూ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితిని పరిశీలించేందుకు ఎస్‌డీఓ కశిష్ బక్షి, ఏఎస్‌పీ రాజ్ కిశోర్ సింగ్ అధికారులతో కలిసి భద్రఘాట్ నుంచి కంగన్‌ఘాట్ వరకు గంగా పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. నీటిమట్టం మరింత పెరిగితే అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 10 పడవలు, 28 మంది సిబ్బంది, ఆరుగురు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. బీఎస్‌ఎఫ్ సిబ్బంది నాలుగు పడవలతో పాటు 30 లైఫ్ జాకెట్లతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. భాగల్‌పూర్ జిల్లాలో గంగా నది కోత తీవ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నౌగచియా ప్రాంతంలోని రఘోపూర్, శంకర్‌పూర్ గ్రామాల వద్ద నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో తీర ప్రాంతం వేగంగా కోతకు గురవుతోంది. బలమైన ప్రవాహం, పెరిగిన నీటి ఒత్తిడి కారణంగా నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి.
ఈ నదీ కోతలో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన చైతి దుర్గాదేవి ఆలయం గంగలో కలిసిపోయింది. సెప్టెంబర్ 1న నది ఉద్ధృతి కారణంగా తీర ప్రాంతం కుంగిపోవడంతో ఆలయ నిర్మాణం క్షణాల్లోనే నీటిలో కొట్టుకుపోయింది. అదే ప్రాంతంలోని హనుమాన్ ఆలయం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
నౌగచియా బ్లాక్‌లో గంగా కోత కారణంగా సుమారు 500 మీటర్ల మేర జమీందారీ కరకట్ట కూడా నదిలో కలిసిపోయింది. నదీ కోత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇళ్లు, వ్యవసాయ భూములు, ఆస్తుల భద్రతపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావం కూడా బీహార్‌లోని పలు సరిహద్దు జిల్లాలపై కనిపిస్తోంది. దీంతో గంగా పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్ల బృందాలు నది కోతను నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు నీటిముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు, మహిళలు గంగా వైపు వెళ్లకుండా, నదిలో స్నానం చేయకుండా అధికారులు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు.
గంగా నీటిమట్టం మరింత పెరిగితే ప్రజల భద్రత కోసం భారతీయ పౌరసురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని సూచించారు.
