వినాయక మండపాల్లో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి: డీఈ ప్రభాకర్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని బెల్లంపల్లి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ప్రభాకర్ సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వైరింగ్‌ను ఓఅండ్‌ఎం సిబ్బందితో తనిఖీ చేయించిన అనంతరం మాత్రమే విద్యుత్ సరఫరా తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద ఎన్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912తో పాటు సంబంధిత ఏఈ, లైన్మెన్, జేఎల్‌ఎం ఫోన్ నంబర్లను ఫ్లెక్సీలపై ప్రదర్శించాలని సూచించారు. విద్యుత్ స్విచ్‌బోర్డులను పిల్లలకు అందకుండా తగిన ఎత్తులో ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు వినియోగించవద్దని హెచ్చరించారు. విద్యుత్ పరికరాలకు సరైన ఇన్సులేషన్, ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు.
ఇన్వర్టర్, జనరేటర్ వినియోగించే సమయంలో రిటర్న్ కరెంట్ ప్రవహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాకర్ సూచించారు. సర్వీస్ వైర్ ఏర్పాటు చేసిన తర్వాత సంబంధిత లైన్మెన్ లేదా జేఎల్‌ఎంకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి మార్పులు చేయరాదన్నారు. మండపాల నిర్మాణంలో ఉపయోగించే ఇనుప పైపులు విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయకూడదని, త్రీపిన్ ప్లగ్‌లను సరైన ఎర్తింగ్‌తో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి భక్తులు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
