హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) లో గణేశ్ లడ్డూ వేలం మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాలో జరిగిన ఈసారి లడ్డూ వేలం ఆశ్చర్యకరంగా రూ.2.30కోట్లకు చేరింది. రాజేంద్రనగర్ (Rajendranagar) పరిదిలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్ (Bandlaguda Kirti Richmond) విల్లాలో రూ.2 కోట్ల 30లక్షల రికార్డు ధర పలికింది. వేలం పాటలో 10కేజీల లడ్డును బాలాగణేష్ టీం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఇదే విల్లాలో జరిగిన వేలంపాటలో రూ.1.87 కోట్లకు లడ్డూ పోగా.. ఈసారి రూ.45 లక్షలు అదనంగా వెళ్లింది. మొత్తం 80 విల్లా ఓనర్లు నాలుగు గ్రూపులు (Four groups) గా విడిపోయి 500కి పైగా బిడ్లతో ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ వేలంపాట సాగడం గమనార్హం. 42 ఎన్జీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు ఈ డబ్బును విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.