Gandhism analysis | గాంధేయ సిద్ధాంతాల విశ్లేషణ
Gandhism analysis | గాంధేయ సిద్ధాంతాల విశ్లేషణ
Gandhism analysis | గాంధీజీపై నాగసూరి దృక్కోణం
పుస్తకంలోని ముఖ్యాంశాలు
గాంధీజీ ఆలోచనల ప్రభావం
సమాజానికి సందేశం
ఎందుకు చదవాలి ఈ పుస్తకం
Gandhism analysis | “క్షమ, మానవతా విలువలతో కూడిన గాంధీ లాంటి ఓ యుగ పురుషుడు ఈ భూమ్మీద నడిచాడంటే రాబోయే తరాలు నమ్మవు” అంటారు విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. గాంధీజీ సిద్ధాంతాలు, జీవన విధానాలు, పోరాట మార్గాలకు సంబంధించి ఆయనను విశ్వమానవుడిగా చూపించే దృక్కోణంలో సుప్రసిద్ధ రచయిత, మేధావి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి శ్లాఘనీయం.
ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న గాంధేయవాదాన్ని సునిశితంగా, చాలా లోతుగా అధ్యయనం చేస్తూ నాగసూరి అక్షరయాత్ర రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పేజీలో “గాంధేయం ఓ గాండీవం” శీర్షికన ప్రచురించిన వ్యాసాల్లో నుంచి 40 వ్యాసాలను అదే పేరుతో ఒక పుస్తకంగా పాఠకుల ముందుకు తీసుకువచ్చారు.
బుద్ధి సూక్ష్మత, క్రమశిక్షణ, పర్యావరణ చైతన్యం, ఖద్దరు ధరించడం, వైజ్ఞానిక దృష్టి, ప్రయోగాత్మకత, ఆరోగ్య సూత్రాలు, ఆహారపు అలవాట్లు, అలుపెరుగని నడక వంటి ఎన్నో వినూత్న అంశాలను గాంధీజీలో దర్శించి, వాటిని ఎంతో నిబద్ధతతో మనకు వేణుగోపాల్ అందించారని డాక్టర్ కాళ్లకూరి శైలజ పేర్కొన్నారు.
గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆచరణ, జీవన విధానం, ప్రభావితమైన వ్యక్తులు, ఉద్యమాలు, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలతో పాటు తెలుగు ప్రాంతంతో ఆయన అనుచరులు, వారి కార్యక్షేత్రాలు, సాధనామార్గాలు కూడా మళ్లీ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని రచయిత నాగసూరి ఈ పుస్తక ప్రారంభంలో పేర్కొన్నారు.
“నాకు దేశభక్తి అంటే మానవత్వమే. నేను దేశభక్తుణ్ణి, ఎందుకంటే నేను మనిషిని. నాలో మానవత్వం ఉంది. నా జీవిత ప్రణాళికలో సామ్రాజ్యవాదానికి చోటు లేదు. వ్యక్తిగతమైన, బహిరంగమైన నియమాల మధ్య సంఘర్షణ ఉండదు” అని యంగ్ ఇండియా పత్రిక (1921 మార్చి 6 సంచిక)లో గాంధీజీ చెప్పిన వాక్యాలతో “అహింస అంటే…” అనే వ్యాసంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది.
“హింస, పిరికితనం ఈ రెండింటిలో హింసే మంచిదంటాను. కానీ హింసా విధానం కంటే అహింసా విధానం వెయ్యిరెట్లు మెరుగని నా ధృడ విశ్వాసం” అంటూ గాంధీజీ చెప్పిన మాటలను “ఆ హింస కూడా అహింసే అవుతుందా?” అనే వ్యాసంలో రచయిత విశ్లేషణాత్మకంగా వివరించారు.

ప్రఖ్యాత తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతున్న కాలంలో గాంధీజీని నేరుగా చూసిన విషయాన్ని రచయిత ప్రస్తావించారు. గాంధీజీ సాగించిన రాజకీయ ఉద్యమాలే కాకుండా, ఆయన సాదాసీదా జీవనం, ఆహారపు అలవాట్లు, ప్రకృతి వైద్యం, పేదరికంతో మమేకం వంటి లక్షణాలు కూడా ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి.
1939 మే 6న ‘హరిజన్’ పత్రికలో గాంధీజీ రాసిన “అహింస ఒక శాస్త్రం. శాస్త్ర దృష్టికి అపజయం అనేది లేదు. ఫలితం రాకపోతే, అది వచ్చేవరకు మరలా ప్రయత్నించాలి” అనే భావనను ఆధారంగా తీసుకుని సత్యాగ్రహాన్ని ఒక విధానంగా రచయిత వివరించారు.
జరథుస్త్ర, మహావీరుడు, డేనియల్, యేసుక్రీస్తు, మహమ్మద్, నానక్ వంటి మహా ప్రవక్తల బోధనలను గాంధీజీ అధ్యయనం చేసి అనుసరించిన తీరు ఆసక్తికరంగా వివరించారు. బుద్ధుడిని విస్మరించిన భారతీయులు గాంధీజీని సరిగా పట్టించుకోలేదని, కానీ ప్రపంచంలోని కొందరు ఆలోచనాశీలి నాయకులు ఆయన సిద్ధాంతాలకు శాశ్వతత్వాన్ని కల్పించారని రచయిత విమర్శాత్మకంగా వ్యాఖ్యానించారు.
“ఏది హింస? ఏది హత్య?”; “బాపూజీకి సినిమాలు నచ్చవా?”; “సర్దార్ పటేల్ ఎందుకు ప్రధాని కాలేదు?”; “ధీరోదాత్త పోరాటశీలి కస్తూర్బా” వంటి అనేక వ్యాసాల ద్వారా గాంధీజీ బహుముఖ వ్యక్తిత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తారు. కాళోజి కవితలతో గాంధీజీ సిద్ధాంతాలకు ఉన్న అనుబంధాన్ని కూడా స్పష్టం చేశారు.
కె. స్వామినాథన్, సర్వేపల్లి రాధాకృష్ణ, నాగసూరి వీరరాఘవయ్య, ఎన్.జి. రంగా, కోడూరు శ్రీరామమూర్తి వంటి ప్రముఖులతో గాంధీజీకి ఉన్న అనుబంధాన్ని వివరించిన వ్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
“You must be the change you wish to see in the world” అని గాంధీజీ చెప్పిన మాటలను ఆచరణలో చూపిస్తూ నాగసూరి వేణుగోపాల్ తనలోనే మార్పును ఆరంభించారు. గాంధేయవాదానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వందలాది మందిని కూడా ప్రేరేపిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే నాగసూరి రచించిన “గాంధేయం ఓ గాండీవం” పుస్తకం ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు—ఇలా అందరూ తప్పక చదవాల్సిన గ్రంథం.
– ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
