గాంధీజీ మార్గం నేటి తరానికీ ఆదర్శం : సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్య మార్గాలు నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుని దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సామరస్య సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని సూచించారు.
గాంధీజీ ఆశయాలను అనుసరించడం ద్వారా సమాజంలో శాంతి, సోదరభావం, ఐకమత్యం మరింత బలోపేతమవుతాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ఐలు సురేష్ నాయక్, డానియెల్, రాజశేఖర్ రెడ్డితో పాటు వివిధ విభాగాలకు చెందిన డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
