గాంధీజీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం

  • జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీజీ ఆశయాలు సమాజానికి నేటికీ మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీజీ అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు.

సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.