Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి మోదీ నివాళులు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రార్థనా సమవేశం ఘనంగా నిర్వహించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి, బాపూజీ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్ముడు చూపిన అహింసా మార్గం, శాంతి సందేశాలు నేటికీ ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని జాతిపితకు అంజలి ఘటించారు. బాపూజీ కన్న కలలను సాకారం చేస్తూ దేశాన్ని స్వచ్ఛంగా, సమగ్రంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు, సేవా దివస్ వేడుకలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
అలాగే, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ వద్ద కూడా నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితర అగ్రనేతలు విజయ్ ఘాట్‌ను సందర్శించి శాస్త్రిగారికి శ్రద్ధాంజలి ఘటించారు. “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని నడిపించిన శాస్త్రిగారి దృఢ నాయకత్వం, లౌక్యం, దేశసేవ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ నవభారత నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
