జిల్లా జైలులో గాంధీ జయంతి వేడుకలు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా జైలులో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, పంచలింగాల మాంటిసోరి స్కూల్ డీన్ సిద్ధు, జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, జైలర్ జి. యర్కి నాయుడు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు తదితరులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బి. లీలా వెంకట శేషాద్రి ఖైదీలను ఉద్దేశించి గాంధీజీ బాల్యం, ఆయన చేపట్టిన ముఖ్యమైన పోరాటాలు, సూక్తులు, సమాజానికి అందించిన సందేశాలను వివరించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగి శిక్షా కాలాన్ని పూర్తి చేసి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు.
జైలులో ఉన్న ఖైదీలకు న్యాయపరమైన సహాయం అవసరమైతే ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, రేషన్, ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. జైలులో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ 15100పై ఖైదీలకు అవగాహన కల్పించారు.
అనంతరం ఖైదీలకు స్వీట్లు పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల మధ్య నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, జైలు వైద్యుడు డాక్టర్ జగదీష్, సోషల్ ఇంక్యుబేటర్ సెంటర్ సభ్యులు శ్రీనివాసరావు, మధుబాబు, హనుమంతప్పతో పాటు జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
