సబ్‌జైలులో ఘనంగా గాంధీ జయంతి

నరసాపురం, ఆంధ్రప్రభ: మహాత్మా గాంధీజీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసాపురం స్థానిక ఉప కారాగారంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జైలు పర్యవేక్షణాధికారి టి. అప్పారావు* అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పదో అదనపు జిల్లా జడ్జి ఎ. వాసంతి, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) జి. గంగరాజు, అదనపు సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఎస్. రాజ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా అతిథులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలు అధికారి టి. అప్పారావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జైలు శాఖ ద్వారా ఖైదీలకు అందిస్తున్న ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

నేర ప్రవృత్తిని విడనాడాలి

పదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ. వాసంతి మాట్లాడుతూ.. గాంధీజీ పాటించిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. నేరాలకు దారితీసే ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఖైదీలకు హితవు పలికారు.

చదువుకునే సమయంలో చెడు వ్యసనాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గంజాయి వంటి వాటికి ఆకర్షితులై నేరాలకు పాల్పడి జైలుకు రావడం వల్ల జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఒక్కసారి పేరు క్రైమ్‌ రికార్డులో నమోదైతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నేర జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి, మంచి ప్రవర్తనతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యతోనే విజ్ఞానం

సివిల్‌ జడ్జి జి. గంగరాజు, అదనపు సివిల్‌ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. విద్యతోనే విజ్ఞానం పెరుగుతుందని, ఉచిత న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.వ్యక్తిలో క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత, సత్ప్రవర్తన, పరివర్తన తీసుకురావడమే జైలు శాఖ ప్రధాన ఉద్దేశమనిపేర్కొన్నారు.

ఖైదీలకు బహుమతులు

కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఐ. జాన్‌ కెన్నడీ, కార్యదర్శి కె. సోమశేఖర్, పీపీ వై.డి. ఫణికర్, న్యాయవాది పి. రఘురామ్, ప్యానెల్‌ లాయర్లు శ్రీనివాసరావు, పుల్లాజి, పద్మజ, ఆనంద్‌, శిరీష, పీఎల్‌వీ కృష్ణ భగవాన్‌, జైలు సిబ్బంది, విజిటింగ్‌ డాక్టర్‌, పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఖైదీలకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం జైలు అధికారి అప్పారావు అతిథులకు జ్ఞాపికలను అందజేశారు.