G7-100-Million-Barrels-Diesel : డీజిల్ కష్టం లేనట్టే…! Andhra Prabha Top Story
G7-100-Million-Barrels-Diesel : డీజిల్ కష్టం లేనట్టే…! Andhra Prabha Top Story
- అమెరికాకు జీ 7 హామీ
- 100 మిలియన్ బ్యారెళ్లకు ఓకే
- 120 మిలియన్ బ్యారెళ్ల కు అమెరికా ప్రతిపాదన
- ఈయూ దేశాల అత్యవసర భేటీలో కీలక నిర్ణయం
హోర్ముజ్ సంక్షోభంతో మండుతున్న ఇంధన మార్కెట్లకు కాస్త ఊరట లభించనుందా? డీజిల్ కొరత, పెరుగుతున్న ధరలతో ఒత్తిడిలో ఉన్న అమెరికాకు జీ7 దేశాలు కీలక హామీ ఇచ్చాయి. రాబోయే నాలుగు నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురు, డీజిల్ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అంగీకరించాయి. తొలి 20 రోజుల్లోనే డీజిల్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించాయి. మరోవైపు.. అమెరికా మాత్రం యూరప్ నుంచి 180 రోజుల్లో 120 మిలియన్ బ్యారెళ్ల డీజిల్ విడుదల చేయాలని ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. అత్యవసర ఇంధన నిల్వల విడుదలతో తక్షణ సరఫరా ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా.. హోర్ముజ్‌లో నౌకాయాన పరిస్థితులు, ఇంధన ఎగుమతులపై ఆంక్షలు, యుద్ధ పరిణామాలే ప్రపంచ మార్కెట్లలో ధరల దిశను నిర్ణయించనున్నాయి.
(బ్రస్సెల్స్/వాషింగ్టన్‌చ ఆంధ్రప్రభ)
ఇరాన్‌తో యుద్ధం.. రష్యా-ఉక్రెయిన్ పోరు.. మూసుకుపోయిన ఇంధన మార్గాలు.. పెరుగుతున్న డీజిల్ ధరలు.. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ అమెరికా-యూరప్ మధ్య కొత్త ఒత్తిడికి దారితీశాయి. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. తమ అత్యవసర నిల్వల్లోని డీజిల్‌ను విడుదల చేయాలంటూ యూరప్‌పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. దీంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
అమెరికా ఒత్తిడిపై చర్చించిన ఈయూ దేశాలు.. మరిన్ని డీజిల్ నిల్వలను విడుదల చేసే అంశాన్ని అమెరికా ఒకపక్షంగా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించబోమనే హామీతో ముడిపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
100 మిలయన్ బ్యారెళ్లకు ఓకే : G7 కీలక నిర్ణయం
నాలుగు నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదల.. తొలి 20 రోజుల్లో భారీగా సరఫరా అమెరికా-యూరప్ మధ్య ఎగుమతులపై నిషేధం ఉండదు.. హోర్ముజ్ సరఫరాలపై సమన్వయానికి అంగీకారం కుదిరింది.
ప్రపంచ ఇంధన మార్కెట్లలో పెరుగుతున్న ఒత్తిడికి అడ్డుకట్ట వేసేందుకు జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్, ముడి చమురు కొరతతో ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో.. రాబోయే నాలుగు నెలల్లో 100 మిలియన్ బ్యారెళ్ల చమురు, డీజిల్ నిల్వలను సమన్వయంతో మార్కెట్‌లోకి విడుదల చేయాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఈ చర్యలను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సమన్వయం చేయనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నేతృత్వంలో శుక్రవారం జీ7 దేశాల మధ్య అత్యవసర చర్చలు జరిగాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాలను సాధ్యమైనంత సులభతరం చేయడం, ప్రపంచ మార్కెట్లలో ధరల ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
తొలి 20 రోజుల్లోనే డీజిల్‌పై ఫోకస్
జీ7 నిర్ణయంలో కీలక అంశం డీజిల్ సరఫరా. నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 100 మిలియన్ బ్యారెళ్ల నిల్వలను విడుదల చేయనుండగా.. మొదటి 20 రోజుల్లోనే గణనీయమైన పరిమాణంలో డీజిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇంధన మార్కెట్లలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న డీజిల్ కొరతను తక్షణం తగ్గించేందుకు ఈ విధానాన్ని అనుసరించనున్నారు.
అమెరికా-యూరప్ మధ్య కీలక హామీ
ఇంధన ఎగుమతులపై పరస్పరం ఆంక్షలు విధించకూడదన్న అంశంపైనా జీ7 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జీ7 దేశాల మధ్య డీజిల్ సహా ఇంధన ఎగుమతులపై నిషేధం విధించబోమని పునరుద్ఘాటించాయి. మార్కెట్లలో మరింత ఒత్తిడి పెరగకుండా ఇతర ఇంధన ఉత్పత్తి దేశాలు కూడా ఎగుమతి ఆంక్షలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాయి. ఇది కీలక పరిణామంగా మారింది. ఎందుకంటే అమెరికాలో డీజిల్ ఎగుమతులను పరిమితం చేసే అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే.. యూరప్ అత్యవసర నిల్వలను విడుదల చేయాలన్న ఒత్తిడి వాషింగ్టన్ నుంచి వచ్చింది.
ట్రంప్ ఒత్తిడి తర్వాతే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలు తమ వ్యూహాత్మక డీజిల్ నిల్వలను విడుదల చేయాలని ఇప్పటికే కోరారు. యూరప్ భారీ మొత్తంలో నిల్వలను వెంటనే విడుదల చేయడానికి అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు.ఆ తర్వాతే మాక్రాన్ జీ7 నేతలతో అత్యవసర చర్చలు నిర్వహించారు. ట్రంప్‌తోనూ మాక్రాన్ మాట్లాడినట్లు ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
120 మిలియన్ బ్యారెళ్ల అమెరికా ప్రతిపాదన
అమెరికా ప్రభుత్వం గురువారం ఈయూ నేతలకు ఓ ప్రతిపాదన పంపినట్లు ‘పొలిటికో’ కథనం వెల్లడించింది. యూరప్‌లోని జాతీయ వ్యూహాత్మక నిల్వల నుంచి 180 రోజుల వ్యవధిలో 120 మిలియన్ బ్యారెళ్ల డీజిల్‌ను విడుదల చేయాలని అమెరికా కోరినట్లు ఓ ఈయూ ప్రభుత్వ అధికారి తెలిపారు.అంతకుముందు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా యూరప్ దేశాలు తమ నిల్వలను ‘వెంటనే’ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.ఈయూ వాణిజ్య చీఫ్ మారోస్ సెఫ్‌కోవిచ్ కూడా జీ-20 వాణిజ్య సమావేశం సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్‌తో డీజిల్ కొరత, పెరుగుతున్న ధరలపై చర్చించారు. ధరలను తగ్గించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని యూరప్ కోరుకుంటోందని ఆయన తెలిపారు.
అమెరికాకు డీజిల్ కష్టం ఎందుకు ?
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం నుంచి ఇంధన ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతోంది. రష్యా, మధ్యప్రాచ్యం, చైనా నుంచి వచ్చే డీజిల్ సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని వైట్‌హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.అమెరికా రిఫైనరీలు మాత్రం రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన తెలిపారు. యూరప్ నుంచి అదనపు సరఫరాలపై ప్రకటనలు వెలువడితే మార్కెట్‌లో ధరల ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉందని వివరించారు.
అమెరికాలో ధర.. రికార్డు!
డీజిల్ ధరల పెరుగుదల అమెరికాను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత వారం అక్కడ డీజిల్ ధర గాలన్‌కు 6.53 డాలర్లకు చేరినట్లు సమాచారం. ఇది రికార్డు స్థాయి. యూరప్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. యూరోపియన్ కమిషన్ గణాంకాల ప్రకారం.. డీజిల్ సగటు ధర లీటర్‌కు 2.24 యూరోలు (గాలన్‌కు సుమారు 9.56 డాలర్లు)గా నమోదైంది. ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో అమెరికాలో డీజిల్ ఎగుమతులను పరిమితం చేసే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం, రిపబ్లికన్ చట్టసభ్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
డీజిల్ అంటే రవాణాకే కాదు..
డీజిల్ ధర పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనాలకే పరిమితం కాదు. ట్రక్కులు, సరకు రైళ్లు, నౌకలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, నిర్మాణ యంత్రాలు, గనుల పరికరాలు, బ్యాకప్ జనరేటర్లు.. ఇలా ఉత్పత్తి, రవాణా రంగాల్లోని అనేక వ్యవస్థలు డీజిల్‌పై ఆధారపడుతున్నాయి. అందుకే డీజిల్ ధర పెరిగితే రవాణా వ్యయం పెరుగుతుంది. దాని ప్రభావం ఆహారం, నిర్మాణ సామగ్రి, సరకు రవాణా వంటి అనేక రంగాలపై పడుతుంది.
రైతులకు ‘డబుల్ దెబ్బ’
ఇంధన ధరల పెరుగుదలతో రైతులపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఒకవైపు డీజిల్ ధరలు పెరుగుతుండగా.. మరోవైపు ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాల్లో ఏర్పడిన అంతరాయాలు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. డీజిల్ ధర పెరగడం ఉత్పత్తి, రవాణాపై పరోక్ష పన్నులా పనిచేస్తుందని జర్మన్ మార్షల్ ఫండ్‌కు చెందిన ఎనర్జీ నిపుణుడు ఈమన్ డ్రమ్మ్ విశ్లేషించారు. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్ల కేంద్ర బ్యాంకులకూ క్లిష్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఎగుమతులపై నిషేధం పెడితే?
ఇదే ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను కలవరపెడుతున్న మరో అంశం. అమెరికా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధిస్తే ప్రపంచ మార్కెట్‌లో సరఫరా ఒక్కసారిగా తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం.. అమెరికా నుంచి వచ్చే సముద్ర మార్గ డీజిల్ సరఫరా ప్రపంచ సరఫరాలో దాదాపు మూడో వంతు వరకు ఉంటుంది. ఎగుమతులపై నిషేధం విధిస్తే ప్రపంచ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారుఅంతేకాదు.. అమెరికా రిఫైనరీలకు విదేశీ మార్కెట్లు మూసుకుపోతే ఉత్పత్తిని తగ్గించే పరిస్థితి రావచ్చని ఎనర్జీ మార్కెట్ నిపుణుడు ష్నైడర్ పేర్కొన్నారు. దీంతో అమెరికాలోనూ ధరలు తగ్గడం కాకుండా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఇది అంతర్జాతీయ సహకారానికి పరీక్ష’
అత్యవసర ఇంధన నిల్వల వ్యవస్థ దశాబ్దాలుగా దేశాల పరస్పర సహకారంతో పనిచేస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. సంక్షోభ సమయంలో దేశాలు సమన్వయంతో నిల్వలను విడుదల చేస్తే మార్కెట్లకు ఊరట లభిస్తుందని చెబుతున్నారు. కానీ దేశాలు పరస్పరం పోటీ పడుతూ నిల్వలను దాచుకోవడం మొదలైతే.. అంతర్జాతీయ సహకారానికి విఘాతం కలగొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇంధనం నుంచి ఆహారం వరకు.. ప్రభావం!
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంధన సరఫరాల విషయంలో అమెరికా-యూరప్ మధ్య విభేదాలు మరింత ముదిరితే.. రవాణా వ్యయాలు, వ్యవసాయ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరగడం.. ఆర్థిక వృద్ధి మందగించడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంటే.. హోర్ముజ్ జలసంధిలో మొదలైన ఇంధన సంక్షోభం.. ఇప్పుడు అమెరికా నుంచి యూరప్ వరకు రాజకీయ, ఆర్థిక ఒత్తిడికి దారితీస్తోంది. డీజిల్ నిల్వల విడుదలపై ఈయూ-అమెరికా మధ్య జరిగే చర్చలు.. రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన మార్కెట్ల దిశను ప్రభావితం చేసే అంశంగా మారాయి.
మార్కెట్‌కు ఊరట వస్తుందా?
అత్యవసర నిల్వల నుంచి భారీ మొత్తంలో డీజిల్, ముడి చమురును విడుదల చేయడం వల్ల తక్షణ సరఫరా ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. రిఫైనరీల సామర్థ్యం, హోర్ముజ్‌లో నౌకాయాన భద్రత, ఇంధన ఎగుమతులపై ఆంక్షలు వంటి అంశాలే రాబోయే రోజుల్లో ధరల దిశను నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం జీ7 నిర్ణయం ద్వారా మార్కెట్‌కు తక్షణ సరఫరా అందించడంతో పాటు.. ఇంధన ఎగుమతులపై దేశాలు పరస్పరం ఆంక్షలు విధించకుండా సమన్వయం చేయాలన్న సందేశం స్పష్టమైంది. హోర్ముజ్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. డీజిల్ ధరల సెగను తగ్గించేందుకు జీ7 దేశాలు తమ అత్యవసర నిల్వల తలుపులు తెరవడం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలో కీలక పరిణామంగా మారింది.
