అనకాపల్లి /చింతూరు, ఆంధ్రప్రభ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత అరుణ అశృ నయనాలతో అభిమానులు, ప్రజాసంఘాలు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం భారీగా జనం ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన గాజర్ల రవి, అంజూ మృతదేహాలను రంపచోడవరం డీఎస్సీ సాయి ప్రశాంత్ పర్యవేక్షణలో పోలీసులు అప్పగించారు. మావోయిస్టు నేత అగ్రనేత చలపతి సతీమణి అరుణ మృతదేహాన్ని కొంచెం ఆలస్యంగా అప్పగించారు. ఆమె తండ్రి లక్ష్మణరావు, చెల్లి ఝాన్సీలకు అరుణ మృతదేహాన్ని అప్పగించారు. శుక్రవారం ఉదయం ఆమె మృతదేహం చేరుకోగానే కరకవాణిపాలెం గొల్లుమంది. ఆమెను కడసారి చూసేందుకు ప్రజలు బారులు తీరారు. అభిమానులు, ప్రజాసంఘాల నాయకులు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అరుణ అంతిమ యాత్ర జరిగింది. బంధు మిత్రులు, ప్రజాసంఘాలు అంతిమ వీడ్కోలు పలికాయి. అంతిమ యాత్రలో ‘కామ్రేడ్ అరుణ అమర్ ర హే’ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి.
అడవిలోనే తను వీడిన అరుణ తార
దాదాపు మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే,, అదే అడవిలోనే జీవితం గడిపిన రావి అరుణ ఎన్నో సార్లు ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. అమెను సజీవంగా పట్టుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల అదుపులో ఉందని కొన్నిసార్లు, అనారోగ్యంతో చనిపోయిదని మరికొన్ని సార్లు వదంతులు వచ్చాయి. ఇన్నాళ్లూ అవన్నీ నిజం కాలేదు. కానీ బుధవారం తెల్లవారుజామున మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ నిజంగానే చనిపోయింది. మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సోమల హత్యలో ..2018లో అప్పటి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో మావోయిస్టులు పట్టపగలే కాల్చి చంపారు. వీరి హత్యలో కీలక సూత్రధారి, పాత్రధారి అరుణేనని పోలీసులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ ఘటనలో ఆమె స్వయంగా పాల్గొన్నారని ప్రచారం జరిగింది. ఇక అరుణ మెట్రిక్యులేషన్ వరకు చదువుకుంది. కొన్నాళ్లకు సాయుధ పోరాటంతో ప్రజలకు న్యాయం చేయవచ్చన్న భావనతో మావోయిస్టు ఉద్యమ మార్గాన్ని ఎంచుకుంది. అంచెలంచెలుగా ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఎదిగింది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతిని పెళ్లాడింది. శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడుకు చెందిన చలపతి మొదటి భార్య రుక్మిణి మరణించడంతో ఆయన అరుణను వివాహమాడారు. 2016లో పాల సముద్రం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో అరుణ తమ్ముడు అజాద్ మరణించారు. అజాద్ ల్యాప్ టాప్‌లో దొరికిన ఫోటోల ఆధారంగా చాలా కాలం తర్వాత అరుణ, చలపతి బాహ్య ప్రపంచానికి తెలిశారు.