డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
- శాసన సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత విజ్ఞప్తి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ శాసన సభ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను డొంక రోడ్లపైనే తరలిస్తారన్నారు. గడచిన ఏడేళ్లుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాల వల్ల డొంక రోడ్లు చాలా చోట్ల ధ్వంస మయ్యాయన్నారు. కానీ వీటి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిధులు ఉన్నా కూడా వీటి వినియోగాన్ని ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
ఇది ఒక్క మైలవరం నియోజకవర్గానికే పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అన్నారు. గతంలో ఏఎంసీల ఆధ్వర్యంలో డైరెక్టర్లు, స్థానిక పాలకులు భాగస్వాములై మార్కెట్ యార్డుల నిధులు వెచ్చించి డొంక రోడ్లను అభివృద్ధి చేసేవారన్నారు. ప్రభుత్వం దీనిపై పరిశీలించి ఏఎంసీ నిధులతో డొంక రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకునే విధంగా తగు అనుమతులు జారీ చేయాలని కోరారు.
