నాగ్‌పూర్‌ టు కరీంనగర్‌.. గంజాయి దందా గుట్టురట్టు

కరీంనగర్‌, క్రైం, ఆంధ్రప్రభ :

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రేకుర్తికి చెందిన మహమ్మద్‌ మున్నా, మహమ్మద్‌ షారుక్‌ కొంతకాలంగా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులు, ఇతరులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లిన ఇద్దరూ గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో గంజాయిని రూ.20 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 2.2 కిలోల గంజాయిని రేకుర్తికి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేశారు. కిలోకు రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నం

గంజాయిని ఓ చేతి సంచిలో పెట్టుకుని రేకుర్తిలోని సమ్మక్క గద్దెల సమీపంలో కెనాల్‌ కాలువ వెంబడి వెళ్తుండగా కొత్తపల్లి ఎస్‌ఐ సాంబమూర్తి తన సిబ్బందితో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన ఇద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వారిని పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న సంచిలో సుమారు 2.2 కిలోల గంజాయిని గుర్తించారు.

పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయితో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్‌హెచ్‌ఓ బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు

నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ సాంబమూర్తి, హెడ్‌ కానిస్టేబుళ్లు హరికేశవ్‌, పరశురాములు, కానిస్టేబుళ్లు శ్రీనాథ్‌, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, శివను సీఐ అభినందించారు.