830 గ్రామాల్లో పోలీసుల ‘పల్లె నిద్ర’
హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు గ్రామాల్లో రాత్రి బస
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన మెగా పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేలా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో బస చేయడం ద్వారా పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువవుతుందని, ప్రజల్లో భద్రతా భరోసాను పెంపొందించడమే పల్లె నిద్ర ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
పల్లె నిద్రలో భాగంగా గ్రామస్థులతో పోలీసు అధికారులు సమావేశమై శాంతిభద్రతలు, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, ఆస్తి నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్థుల నుంచి స్థానిక సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతకు సంబంధించిన అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రాత్రి బస చేయడం ద్వారా ప్రజలు, పోలీసుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని ఎస్పీ అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని, మెగా పల్లె నిద్ర కార్యక్రమం ప్రతిరోజూ కొనసాగుతుందని కె.వి. మహేశ్వరరెడ్డి తెలిపారు.
