వేట బంద్.. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల ఉచిత బియ్యం
తుఫాన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయం
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: తుఫాన్ హెచ్చరికలు, ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో వేటను వాయిదా వేసుకోవడంతో మత్స్యకారులు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లోని అర్హులైన మత్స్యకార కుటుంబాలన్నింటికీ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
