మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలు..
50 మందికి ఆరోగ్య పరీక్షలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిశీలన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
శిబిరంలో సుమారు 50 మంది మహిళలకు రక్తపోటు, రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్ స్థాయి, బరువు, శరీర ద్రవ్యరాశి సూచీ తదితర సాధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, సమాజం బాగుంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
వైద్యాధికారి డాక్టర్ కాటం రాజు మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలోని అన్ని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రణాళిక ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, డీఆర్‌డీవో నాగిరెడ్డి, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వీణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, ఏపీవో యాదయ్య, డాక్టర్ రవీందర్, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, వైద్య, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
