France-Supermarket-Cyberattack : హ్యాకింగ్ హీట్‌,,! Andhra Prabha Top News

France-Supermarket-Cyberattack : హ్యాకింగ్ హీట్‌,,! Andhra Prabha Top News

  • కోట్లాది యూరోల ఫుడ్ మ‌టాష్‌
  • ఫ్రాన్స్‌లో సైబ‌ర్ ఎటాక్
  • సూపర్‌ మార్కెట్లే టార్గెట్
  • ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు ధ్వంసం
  • వందలాది స్టోర్లలో కలకలం
  • మంటలు, భారీగా ఆహార నష్టం
  • నెదర్లాండ్స్‌కూ పాకిన సెక్యూరిటీ సమస్య
  • రంగంలోకి ఫ్రాన్స్‌ సైబర్‌ భద్రతా సంస్థ

(పారిస్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి )

ఆహార పదార్థాలను చల్లగా ఉంచాల్సిన ఫ్రిజ్‌లే వేడెక్కితే..? గడ్డకట్టిన పదార్థాలను భద్రపరచాల్సిన ఫ్రీజర్లలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైతే..? ఊహించడానికే విచిత్రంగా ఉన్నా.. ఫ్రాన్స్‌లోని పలు సూపర్‌ మార్కెట్లలో ఇదే జరిగింది. హ్యాకర్ల సైబర్‌ దాడితో వందలాది దుకాణాల్లోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఆహార పదార్థాలు పాడవడమే కాకుండా కొన్ని చోట్ల మంటలు కూడా చెలరేగాయి. ఒక్క రోజులోనే కోట్లాది యూరోల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రిటైల్‌ రంగం అంచనా వేస్తోంది. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

రాత్రికి రాత్రే మారిన ఉష్ణోగ్రతలు!

పారిస్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌ వ్యాప్తంగా పలు ప్రముఖ ఆహార రిటైల్‌ సంస్థలకు చెందిన దుకాణాల్లో అనుసంధానిత రిఫ్రిజిరేషన్‌ వ్యవస్థలపై భారీ స్థాయిలో సైబర్‌ దాడి జరిగింది. రాత్రివేళల్లో ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను హ్యాకర్లు పెంచడంతో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

పారిస్‌లోని ఓ ఇంటర్‌మార్షే సూపర్‌ మార్కెట్‌లో పనిచేసే సిబ్బంది.. కరిగిపోయిన ఫ్రోజెన్‌ ఫుడ్‌ పదార్థాలను పెద్ద చెత్త కంటైనర్‌లో పడేయడాన్ని స్థానిక నివాసి గీర్ట్‌ డి క్లెర్క్‌ ప్రత్యక్షంగా చూశారు. కరిగిపోయిన ఐస్‌క్రీమ్‌ ప్యాకెట్ల నుంచి పదార్థాలు రోడ్డుపైకి కారుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.

ప్రముఖ రిటైల్‌ సంస్థలకూ దెబ్బ

ఈ దాడి ఫ్రాన్స్‌లోని పలు ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ సంస్థలను ప్రభావితం చేసింది. క్యారీఫోర్‌ సంస్థకు చెందిన 80 సూపర్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దాదాపు 490 దుకాణాలను నిర్వహించే మోనోప్రిక్స్‌ సంస్థలో ఐదు శాతం స్టోర్లపై ప్రభావం పడినట్లు కంపెనీ తెలిపింది. ఇంటర్‌మార్షే రిటైల్‌ సంస్థ యజమాని లెస్‌ మౌస్కెటైర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 150 దుకాణాల్లోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు ఆరు గంటలపాటు 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడెక్కాయి. ఆరోగ్యపరమైన ప్రమాదాలను నివారించేందుకు ప్రభావితమైన ఆహార పదార్థాలన్నింటినీ తొలగించినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. కోఆపరేటివ్‌ యూ సూపర్‌ మార్కెట్‌ గ్రూప్‌ కూడా సైబర్‌ దాడికి గురైనట్లు ఆ సంస్థ సీఈఓ డొమినిక్‌ షెల్చర్‌ వెల్లడించారు. తాజా ఆహార పదార్థాల భద్రతకు, ప్రజల ఆహార సరఫరాకు అత్యవసరమైన పరికరాలనే లక్ష్యంగా చేసుకోవడం అత్యంత తీవ్రమైన, గతంలో ఎన్నడూ చూడని పరిణామమని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.ఇతర ప్రముఖ రిటైల్‌ సంస్థలైన ఈ.లెక్లెర్క్‌, ఓషాన్‌ నుంచి ఈ ఘటనపై వెంటనే స్పందన రాలేదు.

ఒక్క రోజులోనే కోట్ల యూరోల నష్టం?

ఈ దాడితో రిటైల్‌ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై ఇంకా అధికారిక అంచనా వెలువడలేదు. అయితే, ఇంటర్‌మార్షే సీఈఓ థియరీ కొటియార్డ్‌ ఫ్రాన్స్‌ టెలివిజన్‌ ఛానల్‌ బీఎఫ్‌ఎం టీవీతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే పది లక్షల యూరోల స్థాయిని మించి, పదుల మిలియన్ల యూరోల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. యూరోపియన్‌ రిటైల్‌ సంఘం యూరోకామర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ క్రిస్టెల్‌ డెల్‌బెర్గ్‌ స్పందిస్తూ.. సరఫరా వ్యవస్థలోని ప్రతి దశలోనూ సైబర్‌ భద్రత, అంతరాయాలను తట్టుకునే సామర్థ్యం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసిందన్నారు.

ఇంటర్నెట్‌ ద్వారానే ఫ్రిజ్‌ల నియంత్రణ!

సూపర్‌ మార్కెట్లలోని చల్లని నిల్వ విభాగాలను సాధారణంగా ప్రత్యేక కంట్రోల్‌ ప్యానెళ్లు నిర్వహిస్తాయి. ఒకే వ్యవస్థ ద్వారా దుకాణంలోని అనేక ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. నిర్వహణ సంస్థలు ఎక్కడి నుంచైనా సెట్టింగులను మార్చుకునేలా ఈ వ్యవస్థలను ఇంటర్నెట్‌తో అనుసంధానిస్తారు. అదే ఇప్పుడు సైబర్‌ దాడులకు మార్గంగా మారినట్లు అనుమానిస్తున్నారు.ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి సెబాస్టియన్‌ లెకోర్నూ కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. డానిష్‌ సంస్థ డాన్‌ఫాస్‌ అందించిన సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాన్ని ఫ్రాన్స్‌ జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ (ఏఎన్‌ఎస్‌ఎస్‌ఐ) గుర్తించింది.ఈ ఘటనలపై డాన్‌ఫాస్‌ స్పందిస్తూ.. ఫ్రాన్స్‌లో పరిమిత సంఖ్యలో రిఫ్రిజిరేషన్‌ నియంత్రణ వ్యవస్థలు ప్రభావితమైనట్లు తమకు తెలుసునని పేర్కొంది. దెబ్బతిన్న పరికరాలు పాత ఫర్మ్‌వేర్‌తో పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు సపోర్ట్‌ ఉన్న వ్యవస్థలను తాజా ఫర్మ్‌వేర్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని, పాత వ్యవస్థల స్థానంలో ఆధునిక పరిష్కారాలను అమలు చేయాలని తాము చాలాకాలంగా సూచిస్తున్నట్లు వివరించింది.

ముందే సైబర్‌ భద్రతా నిపుణుల వార్నింగ్

సైబర్‌ భద్రతా సంస్థ క్లారోటీకి చెందిన టీమ్‌82 ఆగస్టు 9న డాన్‌ఫాస్‌ ఏకే-ఎస్‌ఎం 800ఏ కంట్రోలర్‌లోని భద్రతా లోపాలపై పరిశోధన వివరాలను ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం.. దాడి చేసేవారు గుర్తింపు ధ్రువీకరణ నియంత్రణలను దాటుకుని, తమ ఆధీనంలోకి తీసుకున్న పరికరాల్లో కోడ్‌ను అమలు చేసే అవకాశం కల్పించే లోపాలను సరిచేసేందుకు డాన్‌ఫాస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు విడుదల చేసింది.ప్రస్తుత దాడులకు, గతంలో గుర్తించిన లోపాలకు ప్రత్యక్ష సంబంధం ఉందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, పాత సాఫ్ట్‌వేర్‌, ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పారిశ్రామిక నియంత్రణ పరికరాలు ఎంతటి ప్రమాదాన్ని సృష్టించగలవో ఈ ఘటన చర్చకు తెచ్చింది.

ఫ్రాన్స్‌ జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రధానమంత్రి లెకోర్నూ ఆదేశించారు. ఇతర యూరోపియన్‌ దేశాలపై కూడా ప్రభావం ఉండవచ్చన్న అనుమానంతో అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌లోని ఇతర కంపెనీలకూ ముప్పు ఉందా? అన్నదానిపై పరిశీలన జరుగుతోంది.

అమెరికాలోనూ …

ఫ్రాన్స్‌లో జరిగిన దాడులు అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. ఆగస్టు చివరి వారంలో అమెరికా సైనిక కమిసరీలుగా పిలిచే సుమారు డజను దుకాణాల్లోనూ ఫ్రిజ్‌లకు సంబంధించిన అంతరాయాలు నమోదయ్యాయి. దీంతో ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఆ ఘటనలకు, ఫ్రాన్స్‌లో జరిగిన దాడులకు మధ్య సంబంధం ఉందా? అన్నది మాత్రం స్పష్టతకు రాలేదు.ఫ్రాన్స్‌ రిటైల్‌ సంఘం ఫెడరేషన్‌ డు కామర్స్‌ ఎట్‌ డు డిస్ట్రిబ్యూషన్‌.. డాన్‌ఫాస్‌ సంస్థ ఈ ఘటనపై పూర్తి పారదర్శకతతో వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేసింది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, దెబ్బతిన్న దుకాణాలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొస్తామని తెలిపింది. ప్రభావితమైన కొన్ని స్టోర్లు ఇప్పటికే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొంది.

నెదర్లాండ్స్‌లోనూ సెక్యూరిటీ సమస్య

ఫ్రాన్స్‌లో సైబర్‌ దాడి కలకలం రేపుతున్న సమయంలోనే నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ రిటైల్‌ సంస్థ ఆహోల్డ్‌ డెల్‌హైజ్‌ కూడా తమ నెట్‌వర్క్‌లో భద్రతా సమస్య తలెత్తినట్లు ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని వ్యవస్థలను నిలిపివేసినట్లు తెలిపింది. నెదర్లాండ్స్‌లో అతిపెద్ద సూపర్‌ మార్కెట్‌ శ్రేణి ఆల్బర్ట్‌ హైజన్‌తో పాటు అమెరికాలోనూ అనేక రిటైల్‌ సంస్థలను నిర్వహించే ఈ కంపెనీ.. సైబర్‌ భద్రతా ఘటన కారణంగా ఆన్‌లైన్‌ కిరాణా సరుకుల డెలివరీలకు అంతరాయం ఏర్పడినట్లు తన మొబైల్‌ యాప్‌లో సందేశం ఇచ్చింది. భౌతిక దుకాణాలు మాత్రం తెరిచే ఉన్నాయి. ఆల్బర్ట్‌ హైజన్‌ విక్రయాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్ల వాటా దాదాపు 10 శాతం. ఈ సంస్థ సేవలకు అంతరాయం కలగడంతో ప్రత్యర్థి రిటైలర్లకు డెలివరీ ఆర్డర్లు పెరిగినట్లు నెదర్లాండ్స్‌ వార్తా సంస్థ ఏఎన్‌పీ తెలిపింది.

అమెరికాలో ఆహోల్డ్‌ నిర్వహించే స్టాప్‌ అండ్‌ షాప్‌, జెయింట్‌, హన్నాఫోర్డ్‌, ఫుడ్‌ లయన్‌ సంస్థల వెబ్‌సైట్లలోనూ తాత్కాలికంగా సేవలు నిలిపివేసినట్లు సందేశాలు కనిపించాయి. అయితే, ఈ అంతరాయాలకు ఫ్రాన్స్‌లోని ఘటనతో సంబంధం ఉందని భావించడానికి ఎలాంటి కారణం లేదని ఆహోల్డ్‌ డెల్‌హైజ్‌ స్పష్టం చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యకలాపాలపై ప్రభావం పడిందా? అన్నది ఇంకా తెలియరాలేదు.

ఆహార భద్రతకు ముప్పు!

ఇప్పటివరకు సైబర్‌ దాడులంటే బ్యాంకింగ్‌, వ్యక్తిగత సమాచారం, ప్రభుత్వ నెట్‌వర్క్‌లు లేదా డేటా చోరీ వంటి అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చేవి. కానీ ఫ్రాన్స్‌ ఘటనతో.. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన సాధారణ శీతలీకరణ పరికరాలను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకుంటే, ఆహార సరఫరా వ్యవస్థ ఎంతటి ప్రమాదంలో పడుతుందో స్పష్టమైంది. ఫ్రిజ్‌ల ఉష్ణోగ్రతలను మార్చడం ద్వారా నిల్వ చేసిన ఆహారాన్ని పనికిరాకుండా చేయడం, అగ్ని ప్రమాదాలకు దారితీయడం.. ఒక సైబర్‌ దాడి ప్రభావం దుకాణాలకే పరిమితం కాదని తెలియజేస్తోంది. సరఫరా వ్యవస్థలోని సాంకేతిక పరికరాలకు సకాలంలో అప్‌డేట్లు చేయడం, ఇంటర్నెట్‌ ప్రాప్యతను కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించే వ్యవస్థలు ఏర్పాటు చేయడం అత్యవసరమని ఈ పరిణామం హెచ్చరిస్తోంది.ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌లోని ఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. దాడుల వెనుక ఎవరున్నారు? ఒకే సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకున్నారా? మరిన్ని దేశాల్లోనూ ఇలాంటి ముప్పు ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.