France-Student-Protests : మ‌హా మార్చ్ ..! Andhra Prabha Top News

France-Student-Protests : మ‌హా మార్చ్ ..! Andhra Prabha Top News

  • క‌దం తొక్కిన ప్రాన్స్ బ‌డిపిల్ల‌లు
  • ఇలు టీచ‌ర్ల‌ కొరత
  • అటు అధ్వాన్న వసతులు
  • క్లాస్ రూమ్ లో కాక్రోచ్ హంటింగ్
  • విద్యార్థుల ఆవేద‌న‌
  • మేయ‌ర్ అండ‌.. పొలీసుల‌పై ఆగ్ర‌హం

(పారిస్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి )

ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, అధ్వాన్న మౌలిక వసతులు, తరగతి గదుల్లో దారుణ పరిస్థితులకు వ్యతిరేకంగా ఫ్రెంచ్‌ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు మూడో వారంలోకి ప్రవేశించాయి. గురువారం కూడా పలుచోట్ల హైస్కూళ్లను విద్యార్థులు దిగ్బంధించగా.. పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు.
పాఠశాలల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఖజానా ఇప్పటికే ఒత్తిడిలో ఉండటంతో.. విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించడం, అదే సమయంలో దేశ రుణభారం, బడ్జెట్‌ లోటును తగ్గించడం ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.

అక్టోబర్‌ చివర్లో పరిష్కారం?

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో అక్టోబర్‌ 7, బుధవారం ప్రధానమంత్రి సెబాస్టియన్‌ లెకోర్ను స్పందించారు. అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వం “స్పష్టమైన, వేగవంతమైన, పూర్తిగా నిధులు సమకూర్చిన పరిష్కారాలను” ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. ఆ పరిష్కారాలు ఏమిటన్న దానిపై మాత్రం ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఇదే సమయంలో విద్యార్థుల ఆందోళనలు ఫ్రాన్స్‌లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తిని బయటపెట్టాయి. ఒకవైపు క్షీణిస్తున్న పాఠశాలలకు భారీగా నిధులు కావాలని డిమాండ్‌.. మరోవైపు అప్పులు, బడ్జెట్‌ లోటును తగ్గించాలని ఆర్థిక మార్కెట్ల ఒత్తిడి.. రెండింటి మధ్య లెకోర్ను ప్రభుత్వం ఇరుక్కుపోయింది.

పోలీసుల తీరుపై దుమారం

ఈ ఆందోళనలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటివరకు వందలాది మంది అరెస్టు కాగా.. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా టీనేజర్లపై అల్లర్ల నియంత్రణ పోలీసులు బలప్రయోగం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.
అక్టోబర్‌ 7, బుధవారం బెల్జియం, స్పెయిన్‌, పోర్చుగల్‌ తదితర యూరోపియన్‌ దేశాల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు.

లీ పెన్‌ సంచలన ప్రకటన

ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై కూడా ఈ ఆందోళనల ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఎన్నికల సర్వేల్లో ముందంజలో ఉన్న మితవాద కుడిపక్ష నేత మెరైన్‌ లీ పెన్‌.. అధికారంలోకి వస్తే భారీగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రకటించారు. అక్టోబర్‌ 6, మంగళవారం మీడియాతో మాట్లాడిన లీ పెన్‌.. 2032 నాటికి 2026తో పోలిస్తే ప్రభుత్వ ఖర్చుల్లో 140 బిలియన్‌ యూరోల నికర పొదుపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.గతంలో ఐదేళ్ల పాలనలో 125 బిలియన్‌ యూరోలు ఆదా చేయాలని తాను ప్రతిపాదించానని.. అయితే ప్రస్తుతం పెరిగిన వడ్డీ రేట్లు, ప్రభుత్వం ప్రతిపాదించిన పరిమిత బడ్జెట్‌ నేపథ్యంలో ఆ లక్ష్యం సరిపోదని ఆమె అన్నారు.

ప్రభుత్వ పనితీరును సరళీకృతం చేయడం ద్వారా, ముఖ్యంగా తన పాలనలోని తొలి మూడేళ్లలోనే ఎక్కువ మొత్తంలో ఖర్చులు తగ్గిస్తామని లీ పెన్‌ తెలిపారు.

బొద్దింకలు పట్టుకుంటున్నాం!’

ఆందోళనల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు పాఠశాలల్లో తమకు ఎదురవుతున్న పరిస్థితులను వివరిస్తున్నారు. మార్సెయ్‌కు చెందిన 28 ఏళ్ల హైస్కూల్‌ టీచర్‌ డయాన్‌ డి సిసుల్లో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్పారు.
విద్యార్థులకు మంచి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య కావాలి. అందుకే దాదాపు ప్రతి నగరంలో ఈ ఉద్యమం విస్తరిస్తోంది” అని ఆమె అన్నారు.ఆమె చేతిలో ఉన్న ప్లకార్డుపై.. ‘నేను టీచర్‌ను.. నా విద్యార్థులు తరగతి గదిలో నాతో కలిసి బొద్దింకలు పట్టుకుంటారు’ అని రాసి ఉంది.

తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే తనకు ఎదురవుతున్న ప్రధాన సమస్య అని డయాన్‌ చెప్పారు.“ఈ ఏడాది నా తరగతిలో 37 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠం ప్రారంభంలో పక్క తరగతి గదుల్లో అదనపు కుర్చీలు, డెస్కులు ఉన్నాయేమో వెతకాల్సి వస్తోంది. అప్పుడే విద్యార్థులు కూర్చొని చదువుకోగలుగుతారు” అని ఆమె వివరించారు.కొన్ని సందర్భాల్లో ముగ్గురు విద్యార్థులు ఒకే డెస్క్‌ను పంచుకోవాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాదు.. కొన్ని పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

“కొన్ని కార్మిక వర్గాల ప్రాంతాల్లో పాఠశాలల పైకప్పులే కూలిపోతున్నాయి. నా ప్లకార్డుపై ఉన్నది నిజమే. గతేడాది నేను పనిచేసిన ప్రాంతంలో తరగతులు జరుగుతుండగానే విద్యార్థులు, నేను కలిసి బొద్దింకలను పట్టుకునేవాళ్లం. అవి టీచర్‌ డెస్క్‌పైనా.. విద్యార్థుల డెస్కులపైనా ఎక్కేవి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్‌ విద్యార్థులు వెనుక బాటు

పాఠశాలల్లో పరిస్థితులు దిగజారిపోవడం వల్లే ఫ్రెంచ్‌ టీనేజర్ల చదువు సామర్థ్యం కూడా పడిపోయిందని ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థులు చెబుతున్నారు.
2025లో నిర్వహించిన PISA (Programme for International Student Assessment) పరీక్షల్లో 15 ఏళ్ల ఫ్రెంచ్‌ విద్యార్థుల గణితం, పఠన సామర్థ్యాల ఫలితాలు OECD సగటు స్థాయిలో లేదా అంతకంటే దిగువన నమోదయ్యాయి. బ్రిటన్‌ విద్యార్థులతో పోలిస్తే ఫ్రెంచ్‌ విద్యార్థులు వెనుకబడ్డారు.

15 ఏళ్ల విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను PISA అంచనా వేస్తుంది.ఈ ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఫ్రాన్స్‌ విద్యాశాఖ మంత్రి ఎడ్వార్‌ జెఫ్రే పేర్కొన్నారు. అయితే అవి పూర్తిగా ఊహించని పరిణామాలు కాదన్నారు. విద్యా సంస్కరణల్లో మిడిల్‌ స్కూళ్లపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో సోషల్‌ మీడియా, ఫోన్ల వినియోగం పెరగడం కూడా చదువుపై ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నట్లు ‘లే మొండ్‌’ వెల్లడించింది.

విద్యార్థులు మాత్రం తమ పాఠశాలల్లోని అధ్వాన్న పరిస్థితులే చదువుపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు.పారిస్‌లో అక్టోబర్‌ 6, మంగళవారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న 19 ఏళ్ల విద్యార్థిని అంగాలి డార్నల్‌ మాట్లాడుతూ.. “ఫ్రెంచ్‌ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని అందరూ చెబుతున్నారు. కానీ మా పాఠశాలల్లో పరిస్థితులు కూడా అంతకంటే దారుణంగా మారాయి. ప్రభుత్వ సేవలు కుప్పకూలుతున్నాయి. అందుకే మేమంతా కలిసి మార్పు కోసం వీధుల్లోకి వచ్చాం” అని చెప్పారు.

విద్యార్థులకు అండగా మేయర్

ఈ ఉద్యమంలో సెయింట్‌-డెనిస్‌ మేయర్‌ బల్లీ బగయోకో పాల్గొనడం కూడా చర్చనీయాంశమైంది. అక్టోబర్‌ 6, మంగళవారం పారిస్‌లో విద్యార్థుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లకుండా అడ్డుగా నిలబడి ‘ఆపండి’ అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విద్యార్థులపై పోలీసులు దాడికి దిగకుండా తాను అడ్డుకున్నానని బగయోకో చెప్పారు. “విద్యార్థుల్లో చాలామంది పోలీసులపై ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. అయినప్పటికీ పోలీసులు వారిపైకి దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు” అని ఆయన అన్నారు.తరువాత పోలీసులు ఆ ప్రాంతంలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని.. అందులో తాను కూడా ఉన్నానని చెప్పారు.

నలుగురు పిల్లల తండ్రినైన తనకు.. వీధుల్లో ఉన్న హైస్కూల్‌ విద్యార్థులు తన పిల్లల్లాగే కనిపిస్తారని బగయోకో అన్నారు.“వాళ్లు నా పిల్లలు కూడా కావచ్చు. అందుకే వారికి అండగా నిలబడటం నా బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు.ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు కేవలం పాఠశాలల్లో కుర్చీలు, ఉపాధ్యాయుల కొరత సమస్యగా మాత్రమే మిగలలేదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఎంత నిధులు అవసరం? దేశ రుణభారాన్ని ఎలా నియంత్రించాలి? ప్రజా సేవలను ఎలా కాపాడాలి? పోలీసుల బలప్రయోగానికి పరిమితులు ఏమిటి? అన్న విస్తృత రాజకీయ, సామాజిక ప్రశ్నలను ఈ ఉద్యమం తెరపైకి