రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నలుగురు విద్యార్థినుల ఎంపిక
సంగారెడ్డిలో జరగనున్న పోటీల్లో మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ప్రతిభ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 3 నుంచి 5 వరకు సంగారెడ్డిలోని ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు.
ఎంపికైన వారిలో పదో తరగతి విద్యార్థినులు బి. రాజేశ్వరి, ఎం. సునీత, ఎనిమిదో తరగతి విద్యార్థిని బి. మంజుల, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఏ. అశ్విత ఉన్నారు.
పాఠశాల ప్రత్యేక అధికారి బి. దేవీలాల్ ప్రోత్సాహం, పీడీ అజ్మీర తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో అందించిన శిక్షణతో విద్యార్థినులు ఈ ఘనత సాధించారు. క్రమం తప్పకుండా సాధన చేయిస్తూ వారి క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచారు. విద్యార్థినుల ఎంపికపై డిప్యూటీ వార్డెన్ జె. వీరమ్మ, ప్రధానోపాధ్యాయుడు బి. రామయ్య, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
