పెదతుమ్మిడి – నరసప్పచెరువు బీటీ రోడ్డుకు శంకుస్థాపన

బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలంలోని పెదతుమ్మిడి గ్రామం నుండి నరసప్పచెరువు గ్రామం వరకు రూ.2.10 కోట్ల సాస్కీ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సాస్కి నిధుల ద్వారా రూ.2.10 కోట్లతో చేపట్టనున్న ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే, పెదతుమ్మిడి నుండి నరసప్పచెరువు వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో ఆయా గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

ఈ సందర్భంగా గ్రామస్తులు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.