గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులే లక్ష్యం
- కొల్లాపూర్లో రూ.2.50 కోట్లతో ఎస్టీ బాలుర వసతిగృహం నిర్మాణానికి శంకుస్థాపన
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్టీ బాలుర వసతిగృహం నూతన భవనానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. చదువుకు అనుకూలమైన వాతావరణం, సురక్షితమైన వసతి, నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే విద్యార్థులు మరింత మెరుగ్గా విద్యనభ్యసించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. గిరిజన విద్యార్థులకు విద్యా అవకాశాలను మెరుగుపరిచి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వసతిగృహాల్లో భవనాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
కొల్లాపూర్లో నిర్మించనున్న నూతన ఎస్టీ బాలుర వసతిగృహం అందుబాటులోకి వచ్చిన అనంతరం విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
