విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు
- సామాజిక స్పృహ పెంపొందించాలి..
- ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలి..
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గ దర్శకులని, వారిలో సామాజిక స్పృహను పెంపొందించి.. ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ఎవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో తల్లిదండ్రులతో పాటు ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయులేనన్నారు.

విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో కూడా పంచుకునే అవకాశం ఉన్నందున పాఠశాలల్లో వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తన, ఆలోచనా విధానం, మనస్తత్వంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సమయంలో సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సోషల్ మీడియా వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా, విజ్ఞతతో వినియోగించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
విద్యార్థులు ఆపదకర పరిస్థితులను ఎలా గుర్తించాలి, ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో మహిళా భద్రతా బృందాల ఆధ్వర్యంలో మంచి స్పర్శ- చెడు స్పర్శ, బాలల రక్షణ, అంతర్జాల భద్రత తదితర అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర నాయకులు శివరాత్రి యాదగిరి, రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, డీటీఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ గౌడ్, కరస్పాండెంట్లు, ఉత్తమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
