బీఆర్ఎస్ సమరభేరికి అనుమతి ఇవ్వాలి..
ఎస్పీకి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమరభేరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌కు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో సమరభేరి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
ఆయా ప్రాంతాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సమరభేరి కార్యక్రమాలను శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు పోలీసుల అనుమతి, సహకారం అందించాలని ఎస్పీని కోరారు. కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కటకం జనార్ధన్, సేగ్గం సిద్దు, గండ్ర హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
