ACB Attack | రూ.12వేలు తీసుకుంటూ పట్టుబడిన అటవీ అధికారి…

ACB Attack | రూ.12వేలు తీసుకుంటూ పట్టుబడిన అటవీ అధికారి…

లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం లంచం
టింబర్‌ డిపో లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం డిమాండ్‌
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు


ACB Attack | నిర్మల్‌, ఆంధ్రప్రభ : టింబర్‌ డిపో లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం లంచం తీసుకుంటూ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ రేంజ్‌ అటవీశాఖకు చెందిన సెక్షన్‌ అధికారి అయిండ్ల రవీందర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

టింబర్‌ డిపో లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయడంతో పాటు డిపోకు సంబంధించి ఎలాంటి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించకుండా ఉండేందుకు డిపో యజమాని సెక్షన్‌ అధికారి రవీందర్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారంలో రవీందర్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

అధికారి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఇందులో భాగంగా గురువారం రవీందర్‌ రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రవీందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అనంతరం ఆయనను కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.