MLA Kunamneni | అసైన్డ్ భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి..
పెద్దల చేతుల్లోకి వెళ్లిన భూములను వెలికితీయాలి..
భూకబ్జాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
MLA Kunamneni | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెద్దల చేతుల్లోకి వెళ్లిన అసైన్డ్ భూములను గుర్తించి బయటకు తీయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరమని అన్నారు.
కొంతమంది పెద్దలు ఎస్‌ఆర్‌ఎస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ భూములు ఎక్కడ ఉన్నాయి? ఎంత మేర చేతులు మారాయి? అనే విషయాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.
కాగితాల్లో అసైన్డ్, అటవీ భూములుగా నమోదై ఉన్నప్పటికీ.. లోపల కొనుగోళ్లు, లావాదేవీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విలీనం అనంతరం పలువురు భూములు వదిలి పాకిస్థాన్‌కు వెళ్లారని, అప్పట్లో నవాబులు వదిలి వెళ్లిన వేల ఎకరాల భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేల్చాలని ప్రశ్నించారు.
అధికారులు, నేతల అండతో భూకబ్జాదారులు, పైరవీకారులు, భూమాఫియా పెరిగిందని కూనంనేని ఆరోపించారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో 25 మంది వద్ద రూ.4,500 కోట్ల విలువైన ఆస్తులు బయటపడటం ఆశ్చర్యకరమని అన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా గుర్తించి బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
