50 ఏళ్లలో తొలిసారి.. వలకు చిక్కిన 40 కేజీల చేప

రూ.10 వేలతో భారీ చేప కొనుగోలు
చేప పట్టిన యువకుడికి అదృష్టం

జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ: ఎర్ర కాల్వ జలాశయంలో వేటగాళ్ల వలకు సుమారు 40 కిలోల బరువున్న భారీ శీలావతి చేప చిక్కింది. జంగారెడ్డిగూడెం రూరల్‌ మండలంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాల్వ ప్రాజెక్టులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత భారీ చేప ఎర్ర కాల్వలో గతంలో ఎప్పుడూ పట్టుబడలేదని స్థానికులు తెలిపారు.

కొంగువారిగూడెంకు చెందిన మత్స్యకారుడు సత్తిబాబు వేటకు వెళ్లగా ఆయన వలలో ఈ భారీ చేప చిక్కింది. గతంలో ఈ మార్గంలో ప్రయాణించిన ఏలూరుకు చెందిన ఓ కుటుంబం ఎర్ర కాల్వలో సహజంగా లభించే చేపల గురించి తెలుసుకుని, మత్స్యకారులకు తమ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. భారీ చేప వలకు చిక్కిన విషయం సత్తిబాబు వారికి తెలియజేయడంతో వారు ప్రత్యేకంగా కారులో అక్కడికి వచ్చారు.

చేపను పరిశీలించిన అనంతరం ఆ కుటుంబం రూ.10 వేల ధరకు కొనుగోలు చేసింది. చేపను ఇంటికి తీసుకెళ్లి తాము వినియోగించడంతో పాటు బంధువులు, సన్నిహితులకు కూడా పంచుకుంటామని వారు తెలిపారు. భారీ శీలావతి చేప దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు పేర్కొన్నారు.

కొత్త నీటికి ఎదురెళ్లడంతో వలకు చిక్కిందా?

వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఈ ప్రాంతంలో, ఎగువ అటవీ ప్రాంతాల్లో ఇప్పటివరకు భారీ వర్షాలు పెద్దగా కురవలేదని మత్స్యకారులు తెలిపారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరుతోంది. కొత్త నీటి ప్రవాహానికి ఆకర్షితమయ్యే భారీ చేపలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లే సమయంలో వేటగాళ్ల వలకు చిక్కి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

గతంలో కూడా ఈ ప్రాంతంలో భారీ చేపలు వలకు చిక్కిన సందర్భాలు ఉన్నాయని మత్స్యకారులు తెలిపారు. సుమారు 5–6 కిలోమీటర్ల దూరంలోని జల్లేరు వంతెన వద్ద వరదల సమయంలో పెద్ద చేపలు పట్టుబడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అయితే అవి సాధారణంగా 20 నుంచి 25 కిలోల బరువు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు.

మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయసు ఉంటుందని అంచనా

ప్రస్తుతం వలకు చిక్కిన చేప బరువు సుమారు 40 కిలోలు ఉండటంతో దీని వయసు కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉండవచ్చని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. చేప పొలుసులు, చర్మం చాలా గట్టిగా ఉండటంతో సాధారణంగా ఉపయోగించే కత్తితో కోయడం కూడా కష్టంగా ఉందని వారు తెలిపారు. భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.