సంగారెడ్డి వైద్య రంగంపై ఫోకస్‌.. మౌలిక వసతులకు ప్రాధాన్యం..

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 17న సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, నర్సింగ్ హాస్టల్, మెడికల్ కళాశాల క్రీడా సముదాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి బుధవారం మంత్రి వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్ కళాశాలలు, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పరికరాలు, నిర్వహణ, పెండింగ్ పనులు, భవిష్యత్ అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, బాలికలు, బాలుర వసతి గృహాల్లో సౌకర్యాలు, అవసరమైన పరికరాలు, చేపట్టాల్సిన అదనపు పనులపై కళాశాల ప్రిన్సిపాల్‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేందుకు అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు.

జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, వాటి పనితీరు, నిర్వహణ, భవనాల నిర్వహణ, రోగుల సంరక్షణ, పారిశుద్ధ్యం, భద్రత, ఘన వ్యర్థాలు, వైద్య వ్యర్థాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఆసుపత్రిలోని ప్రతి వైద్య పరికరానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని, మరమ్మతులు అవసరమైన పరికరాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను నాణ్యతా ప్రమాణాలతో అందించాలని స్పష్టం చేశారు.

మెడికల్ కళాశాల, జీజీహెచ్ నిర్వహణకు సంబంధించిన అన్ని సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. కళాశాల, ఆసుపత్రి వార్షిక నిర్వహణ అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత కార్యనిర్వహణ సంస్థలకు సూచించారు. నర్సింగ్ కళాశాలల అభివృద్ధి, వసతి గృహాల పురోగతి, విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది, పరికరాలు, వసతి సౌకర్యాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.

ఈ నెల 17న సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, నర్సింగ్ హాస్టల్, మెడికల్ కళాశాల క్రీడా సముదాయాల ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి తదితర వైద్య సంస్థల్లో మిగిలిన చిన్నచిన్న పనులు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

వాటిని ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో సింగూర్ కాలువల లైనింగ్, కట్ట మరమ్మతు పనులను కూడా వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.