పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
- మహిళల కేసుల్ని తీవ్రంగా పరిగణించండి
- హైవేల్లో నిఘా పెంచండి
- కర్నూలు పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : పెండింగ్ కేసులను తగ్గించేందుకు మరింత కృషి చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) పోలీస్ అధికార, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు(Police) మరింత బలోపేతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కేసు విచారణలో టెక్నాలజీ(Technology)ని సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం(Vyas Auditorium)లో జరిగిన ఈ సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సై(DSPs, CIs, SSI)లు పాల్గొన్నారు. ప్రతి కేసును సిసిటిఎన్‌ఎస్‌లో సమయానికి నమోదు చేయాలని, గ్రేవ్ ప్రాపర్టీ కేసులు, హత్యలు వంటి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్, ఈ-ఎఫ్‌ఐఆర్(FIR, E-FIR), ఈ సాక్ష్య యాప్‌ల వినియోగాన్నిపెంచాలని సూచించారు.
అర్హత ఉన్న కేసులనే లోక్ అదాలత్‌కి పంపాలని, రౌడీషీటర్ల కదలికలపై గట్టి నిఘా ఉండాలన్నారు.తక్కువ సమయంలో కేసుల చేధనకు ప్రతి సబ్‌డివిజన్‌లో డాగ్ స్క్వాడ్, జాగీలాలు, క్లూస్ టీమ్(Clues Team) ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలపై నేరాలను తీవ్రంగా పరిగణించాలని, 60 రోజుల్లోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. ప్రాముఖ్యత ఉన్నకేసులపై డిఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయిలో మానిటరింగ్ ఉండాలని, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని చెప్పారు.
రోడ్డుప్రమాదాల నివారణకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు రోడ్డు భద్రతపై ప్రత్యేక డ్రైవ్(Drive) నిర్వహించాలని నిర్ణయించారు. నేషనల్, స్టేట్ హైవేల్లో రాంగ్ రూట్, డ్రంక్ అండ్ డ్రైవ్, నో హెల్మెట్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకోవాలని, తెల్లవారు జామున 3 నుంచి 6 గంటల వరకు స్టాప్, వాష్ అండ్ గో(Wash and Go) కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్పీడ్ బ్రేకర్లపై వైట్ బార్డర్ మార్కింగ్, మలుపుల వద్ద బ్లింకర్స్, రేడియం స్టిక్కర్స్(Radium Stickers) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తెలిపారు.
మొబైల్ సెక్యూరిటీ చెక్ పరికరాలతో అనుమానితుల వేలిముద్రలను సేకరించాలన్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం చలనంలో ఉండాలని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే స్పందించాలన్నారు. ఇటీవల వివిధ కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమీక్ష సమావేశంలో లీగల్ అడ్వయిజర్(Legal Advisor) మల్లికార్జున రావు, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.