సోలార్ విద్యుత్‌పై ఫోకస్ :భట్టి విక్రమార్క
15 వేల మెగావాట్ల నుంచి 19,543 మెగావాట్లకు పెరుగుదల
విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు ప్రణాళికలు
‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ’ ప్రభుత్వం
విద్యుత్ డిమాండ్ దూసుకెళ్తోంది!
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల బలోపేతం
సౌర, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్లు ఉండగా.. ఈ నెల 9వ తేదీ నాటికి అది 19,543 మెగావాట్లకు చేరిందని అసెంబ్లీలో వెల్లడించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించడం, ప్రజల వినియోగ శక్తి పెరగడం తదితర కారణాలతో విద్యుత్ అవసరం వేగంగా పెరుగుతోందని భట్టి పేర్కొన్నారు. భవిష్యత్‌లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
సౌర విద్యుత్‌పై ఫోకస్
విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సౌర విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్ తదితర మార్గాలను ప్రోత్సహించేందుకు విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. అధ్యయనం పూర్తయిన అనంతరం దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
