ఇంద్రకీలాద్రిపై ‘సేఫ్టీ’ ఫోకస్‌

  • శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సీపీ పరిశీలన
  • సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాట్ల పరిశీలన
  • భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా
  • స్నానఘాట్లు, క్యూ లైన్లను పరిశీలించిన సీపీ రాజశేఖర్ బాబు
  • రద్దీ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
  • అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో త్వరలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర బాబు బుధవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వివిధ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న కేశఖండనశాలను సీపీ రాజశేఖర్ బాబు పరిశీలించారు.

ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్నానఘాట్లను, భక్తుల దర్శనానికి ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లను సీపీ రాజశేఖర్ బాబు పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమబద్ధంగా ముందుకు సాగేలా ఉన్న ఏర్పాట్లను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ పెరిగే ప్రాంతాలు, వారికి అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, దర్శన మార్గాల నిర్వహణకు సంబంధించి ముందస్తు చర్యలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను సీపీ రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది.